● జిల్లాలో 8కి చేరిన కేసులు
● అందులో ఇద్దరు మతి
● తెలియక సపర్యలు చేసినందుకు ఇద్దరికి పాజిటివ్
కడప రూరల్: కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకే భయంకరమైన అంటు వ్యాధి. కోవిడ్ సోకిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా.. కరచాలనం చేసినా వెంటనే సంక్రమించే జబ్బు ఇది. అవగాహన, తక్షణ వైద్య పరీక్షలు, వైద్య చికిత్సల ద్వారానే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా నియంత్రించొచ్చు. అలాంటి కోవిడ్ పై యంత్రాంగం అప్రమత్తం చేయకుండా గోప్యతను పాటించడం పట్ల సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.
సాధారణ జబ్బు అని తోడుగా ఉన్నందుకు...
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అధికారికంగా మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. అందులో రాజంపేటకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి సీఎంసీ రాయవేలూరులో చికిత్స పొందుతూ మరణించాడు. కడప నగరం మాసాపేటకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు దెబ్బతిని, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇతను కడప రిమ్స్‌కు చికిత్స కి వెళ్లగా, అనుమానంతో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో పాజిటివ్ గా తేలింది. ఈ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. వల్లూరు మండలంలో 66 ఏళ్ల వద్ధుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. కడప నగరం ఆర్టీసీ కాలనీకి చెందిన 67 ఏళ్ల వద్ధుడు విషద్రావణం తాగడంతో అతన్ని చికిత్స కోసం కడప రిమ్స్ కు తీసుకెళ్లగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇతను కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. కడప నగరం నకాష్ వీధికి చెందిన 70 ఏళ్ల వ్యక్తి కూడా కరోనాకు గురై, కడప రిమ్స్ లో వైద్యం పొందుతున్నాడు.
ప్రధానంగా కడప మాసాపేటకు చెందిన వ్యక్తి కోవిడ్ కారణంగా మృతి చెందిన సంఘటనకు సంబంధించి, ఆయన కుమారుడు 20 ఏళ్ల యువకుడు, తన తండ్రికి వచ్చింది కరోనా అని తెలియక, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, తండ్రికి తోడుగా ఉండి సేవలు చేయడంతో కోవిడ్ సోకింది. దీంతో యువకుడు చికిత్స పొందుతున్నాడు. అలాగే ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. కడప నగరం ఆర్టీసీ కాలనీకి చెందిన 67 ఏళ్ల వ్యక్తికి, తండ్రిగా ఆయన కుమార్తె 20 ఏళ్ల యువతి సేవలు చేసినందుకు కరోనాకు గురై చికిత్స పొందుతోంది. అదే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సమాచారం ఇచ్చి, అవగాహన కల్పించి ఉంటే ఆ ఇద్దరికీ కరోనా సోకేది కాదనేది స్పష్టంగా అర్థమవుతోంది.
కరోనా వల్ల ప్రపంచం యావత్తు కుదేలైంది. ఎంతోమంది లక్షలు ఖర్చుపెట్టిన ప్రాణాలు మాత్రం దక్కలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. అయితే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.నాడు వలంటరీ వ్యవస్థ ఉండడంతో ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపరిచిన చర్యలు చేపట్టారు. ఇప్పుడా పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ‘కరోనా రాని.. మరి ఏదైనా జరగని.. ప్రజలు ఎలాగైనా పోనీ’అనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు మిన్నంటాయి. కాగా ఇప్పటివరకు మొత్తం నమోదు అయినవి 8 కేసులేనా... ఇంకా ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం నమోదైన కేసులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవిబాబు ధ్రువీకరించారు.


