● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
లక్కిరెడ్డిపల్లి : మండల పరిధి నలందా నగర్‌లోని ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి నివాసం సమీపంలో శుక్రవారం సాయంత్రం 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రివర్స్ తీసుకునే సందర్భంలో.. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఢీకొంది. దీంతో స్తంభం విరిగి ఒరిగిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటం.. ఒక్కసారిగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాలకు పైన ఉన్న 11 కేవీ వైర్లు కాస్త గట్టిగా ఉండటంతో.. స్తంభం విరిగినా బస్సుపై పడకుండా వైర్ల మీద నిలవడంతో పెను ప్రమాదం నుంచి విద్యార్థులు, డ్రైవర్ బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ హరినాథ్ సంఘటనా స్థలానికి చేరుకొని స్తంభాన్ని పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా కాలం చెల్లిన కొన్ని స్కూళ్ల బస్సులలో విద్యార్థుల ప్రాణాలు సురక్షితమేనా అని పలువురు తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


