అంగన్‌వాడీ.. ఆగ్రహ వేడి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ.. ఆగ్రహ వేడి

Jul 11 2026 3:34 AM | Updated on Jul 11 2026 3:34 AM

అంగన్‌వాడీ.. ఆగ్రహ వేడి

సాక్షి, మదనపల్లె : ప్రభుత్వం తమ సమస్యలను కనీసం పట్టించుకోకుండా, పనిభారం మోపిందని, ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా వెట్టిచాకీరి చేయించుకుంటోందని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు అన్నం పెట్టి వారి ఆలనాపాలనా చూసే అంగన్‌ వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. 50 ఏళ్లుగా సేవ చేస్తున్నా కనీస గౌరవం, గుర్తింపు లేదని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం వారు మదనపల్లెలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వీరు మదనపల్లెకు చేరుకోగా.. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో.. కలెక్టరేట్‌ సమీపంలోని మిషన్‌ కాంపౌండ్‌ వద్దకు చేరుకొని అక్కడే రెండు గంటలకుపైగా బైఠాయించారు. బ్యానర్‌, ప్లకార్డులను చేతబట్టి నినాదాలు చేశారు. సేవలను ప్రభుత్వం గుర్తించాలి, అందుకు తగిన ప్రతిఫలం ఇవ్వాలంటూ పిడికిళ్లు పైకెత్తి నినదించారు. అంగన్‌వాడీలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్టారు. యాప్‌లు, సర్వేలు, ఇతర పనులను చేయించుకొంటున్న ప్రభుత్వం తమ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పలువురు సీఐటీయూ మహిళ నాయకులు, వర్కర్లు ప్రసంగించారు. మిషన్‌ కాంపౌండ్‌ నుంచి కలెక్టరేట్‌కు అంగన్‌వాడీలు ప్రదర్శనగా చేరుకున్నారు. ముఖద్వారం వద్ద భారీగా పోలీసులు మొహరించి.. వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. అక్కడే కొంతసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిమందికి మాత్రమే కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో సంఘ నాయకులు వెళ్లారు. జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సమస్యలను ఆయనకు విన్నవించగా ప్రభుత్వ స్థాయిలోని సమస్యలు, డిమాండ్లను తాము తీర్చలేమని, జిల్లాస్థాయిలో తాము పరిష్కరించగలిగే సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

డిమాండ్లు నెరవేర్చాల్సిందే

బైఠాయింపు, ధర్నా సందర్భంగా సీఐటీయూ మహిళా నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి, మధ్యలో విధులకు దూరమైన వారికి కూడా గ్రాట్యూటీ అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లాలో రాజకీయ జోక్యం వల్ల హెల్పర్లు ప్రమోషన్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రమోషన్లకు ఐదేళ్ల సీనియారిటీ పెట్టారన్నారు. 1800 మినీ సెంటర్లు మెయిన్‌ సెంటర్లుగా అప్‌డేట్‌ చేయకపోగా, మినీ సెంటర్లను విలీనం చేసినా వారికి ఇంకా హెల్పర్‌ వేతనమే ఇస్తున్నారని అన్నారు. నవచేతన యాప్‌ వల్ల పనిభారం పెరిగిందని, దీన్ని తొలగించాలన్నారు. అంగన్వాడీలకు టీఏ బిల్లులు మంజూరు చేయాలన్నారు. బీఎల్‌ఓ డ్యూటీల నుంచి అంగన్వాడీలను మినహాయించాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు, పెండింగ్‌లోని 164 సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకురాళ్లు మధురవాణి, గంగాదేవి, గౌరీ, భాగ్యలక్ష్మి, లీలావతి, ఓబులమ్మ, అపర్ణ, శ్రీవాణి, విజయ, భూకై లేశ్వరీ, సత్యలక్ష్మి, రాధిక, శంకరమ్మ, వాణికుమారి పాల్గొన్నారు.

మూతపడిన కేంద్రాలు

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల నుంచి వర్కర్లు, హెల్పర్లు అందరూ మదనపల్లెలో అందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలిరావడంలో కేంద్రాలన్నీ మూతపడ్డాయి. ప్రతి కేంద్రం నుంచి హాజరు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేంద్రాలకు పిల్లలు రాలేదని తెలుస్తోంది. ఆందోళన కార్యక్రమం ముగిసిన తర్వాత వెనుదిరిగి వెళ్లారు. రెండువేల మంది దాకాఆందోళకు తరలిరావడంతో పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వర్కర్లు, హెల్పర్లతో రద్దీ నెలకొంది.

కూటమి పాలనపై పెల్లుబికిన నిరసన

ఇంకెన్నాళ్లు వెట్టిచాకిరి అంటూ

మండిపాటు

వేతనాల పెంపు, పీఎఫ్‌, పెన్షన్‌ ఇవ్వరా?

కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు అనుమతి నిరాకరణ

మదనపల్లె మిషన్‌ కాంపౌండ్‌లో

బైఠాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement