సదుం : ట్రాక్టరు ట్రాలీపై నుంచి జారిపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మండలంలోని చెరుకువారిపల్లె పంచాయతీ నల్లరాల్లపల్లెకు చెందిన అశోక్(31) గత నెల 26న తన ట్రాక్టరుతో పొలం వద్దకు వెళ్లి ట్రాలీలో ఉన్న మామిడి కాయల ట్రేలు దించుతుండగా జారి పడి గాయపడ్డాడు. అతనిని కుటుంబ సభ్యులు తిరుపతి రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కలికిరి : కలికిరి పట్టణ పరిధిలో బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ అనీల్‌కుమార్ తెలిపారు. వివరాలు... పట్టణంలో బీడీ కాలనీకి చెందిన బాబా సాహెబ్ కుమార్తె(16) గురువారం ఉదయం నుంచి కనిపించడం లేదని, చుట్టుపక్కల వారిని, బంధువులను విచారణ చేసినా ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
కలకడ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని హెచ్‌పీసీఎల్ విజయపూడి–ధర్మపూరి పైప్‌లైన్ బూస్టర్ పాయింట్–కలకడ కేంద్రం చీఫ్ మేనేజర్ దుర్గాసాయిప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వంద మొక్కలు వితరణ చేసి విద్యార్థులచే నాటించారు. వాటిని పరిరక్షించే బాధ్యత బావి భారత పౌరులుగా విద్యార్థులపై ఉందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై స్వచ్ఛతపక్వాడ కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ గత ఏడాది కోన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన బల్లలు, కంప్యూటర్ వంటివి, ఈ ఏడాది బంగావాండ్లపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వాటర్ ట్యాంక్, మినిరల్ వాటర్ ప్లాంట్ వితరణ చేసిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ సిబ్బంది లక్ష్మీకాంత్, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రాయచోటి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి చాంద్ బాషా (21) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాయచోటి పట్టణానికి చెందిన చాంద్ బాషా సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుండే వాడు. గురువారం సాయంత్రం రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలోని పాత ఎస్పీ కార్యాలయం సమీపంలో బైకు అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


