వేంపల్లె : వేంపల్లె టౌన్‌లో రెండు వేర్వేరు చోట్ల దొంగతనం చేసిన కేసుల్లో జయప్రకాశ్ రెడ్డి, దివాకర్‌కు జైలు శిక్ష విధించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె నాయీ బ్రాహ్మణ వీధికి చెందిన మళ్లీ బోయిన రామకృష్ణ ఇంట్లో రాత్రిపూట దొంగతనం జరిగిన కేసులో బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా జయప్రకాష్‌రెడ్డి, దివాకర్‌ను పట్టుకొని బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసి పులివెందుల కోర్టులో హాజరు పరచగా.. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్.. ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. అలాగే రెడ్డి నగర్ వీధిలో నర్రెడ్డి లక్ష్మీదేవి ఇంటిలో పగటిపూట జరిగిన దొంగతనం కేసులో బంగారు, వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు సదరు వ్యక్తి వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితులు జయప్రకాష్‌రెడ్డి, దివాకర్‌లను పట్టుకొని వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసి పులివెందుల కోర్టులో హాజరు పరచగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్.. ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు. ఈ రెండు కేసులలో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జి.మధుసూదన ఆచారి వాదనలు వినిపించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన సీఐ నరసింహులు, ఎస్‌ఐ తిరుపాల్ నాయక్, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్‌లను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.


