కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విడుదల చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకులు సుమారు మూడు లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టించి, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజానీకం ఆర్థిక ఎదుగుదలకు విశేష కృషి చేస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో జీవనోపాధి పొందుతున్న డిగ్రీలు, ఎంఏలు, బీటెక్ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారిని వీధుల పాలు చేయడం తగదని విమర్శించారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్, సేవా కేంద్రాల ఏర్పాటు చేయాలని ఇచ్చిన జీవో నెంబరు 396ను తక్షణం రద్దు చేయాలన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, లేఖర్లకు, వెండర్లకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు యు.సంజీవరాయుడు, బసవరాజు, శివ, జమాలుద్దీన్, జి.వేణుగోపాల్, కొండారెడ్డి, రామసుబ్బయ్య, ప్రసాదు, సుధీరు, రవిబాబు, సాయి, సుబ్బయ్య, కే ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.


