● జిల్లాలో ముందస్తు అప్రమత్తత అవసరం
● మదనపల్లె, రాయచోటిలో
కరువైన ప్రత్యేక వార్డులు
● పీలేరులో మాత్రమే ఏర్పాటు
సాక్షి, అన్నమయ్య: నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మరచి ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు రోగులు దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతూ, కరోనా పాజిటివ్‌తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో అన్నమయ్య జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వైరస్ ఇంకా సమాజం నుంచి పూర్తిగా తొలగిపోలేదా అనే మీమాంసలో పడిపోయిన తరుణంలో, కూటమి ప్రభుత్వంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాటి భీభత్సం.. నేటి నిర్లక్ష్యం
గతంలో 2021–22లో కరోనా తీవ్రతతో ఆసుపత్రులు నిండిపోయి ఆక్సిజన్ సమస్య నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడింది. ఊరూరా క్వారంటైన్ కేంద్రాలు, ప్రత్యేక బెడ్లను సమకూర్చిన పరిస్థితులు చూశాం. 2022 తర్వాత కరోనా వేరియంట్ మారి అంతగా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జనం ధైర్యంగా ముందుకు సాగుతున్న స్థితిలో కడపలో కరోనా మరణాల కలకలం మళ్లీ తీవ్ర చర్చకు దారి తీసింది.
విస్తరించకముందే మేల్కొనాలి
కరోనా పూర్తిగా విస్తరించిన తర్వాత మేల్కొనడం కంటే ముందస్తుగా చర్యలు చేపట్టాలని పలువురు పేర్కొంటున్నారు. ఒక్కసారి పాజిటివ్ కేసులు కనిపించిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో వైరస్ వ్యాపించకముందే ప్రత్యేక చర్యలను చేపట్టాలి. అయితే ఇప్పటివరకు జిల్లా కేంద్రమైన రాయచోటి మొదలుకొని మదనపల్లెలో కూడా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. పీలేరులో మాత్రం వార్డును ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా క్వారంటైన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి
వైఎస్సార్ కడపజిల్లాలో కరోనా పాజిటివ్ నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మాస్క్‌లు ధరించడంతోపాటు తగిన భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కరోనా లాంటి మహమ్మారి లేకపోయినా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ముందుకు సాగవచ్చు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కనీస ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం.
పీలేరులో ఐసోలేషన్ వార్డు
పీలేరు రూరల్ : స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆరు పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, డెంగ్యూ, కోవిడ్ పేషెంట్లకు అనువుగా ఐసోలేషన్ వార్డు సిద్ధం చేసినట్లు తెలిపారు.
కోవిడ్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక మార్గదర్శకాలు
టెస్ట్ – ట్రాక్ – ట్రీట్ విధానం : కరోనా లక్షణాలు (జ్వరం, పొడిదగ్గు, ఆయాసం, గొంతునొప్పి) కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా కోవిడ్ పరీక్ష (RTPCR, Rapid Antigen) చేయించుకోవాలి.
హోమ్ ఐసోలేషన్ నిబంధనలు : పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లో ప్రత్యేక గదిలో కనీసం 7 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబ సభ్యులతో కలవకూడదు. ప్రత్యేక శౌచాలయం, ప్లేట్లు మరియు దుస్తులు ఉపయోగించాలి.
హై–రిస్క్ గ్రూపుల రక్షణ: వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణీలు, చిన్న పిల్లలు, మరియు కిడ్నీ, గుండె, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి.
ఆక్సిజన్ లెవెల్స్ పర్యవేక్షణ: ఐసోలేషన్‌లో ఉన్న రోగులు పల్స్ ఆక్సిమీటర్ ద్వారా రోజుకు 3–4 సార్లు ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ లెవెల్స్ 94% కంటే తగ్గితే తక్షణమే ఆసుపత్రికి తరలించాలి.
బూస్టర్ డోస్: వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన వారు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ప్రికాషన్/బూస్టర్ డోసును ఖచ్చితంగా వేయించుకోవాలి.
అత్యవసర కోవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లు
కరోనా సమాచారం, ఉచిత వైద్య సలహాలు, ల్యాబ్ పరీక్షలు మరియు ఆసుపత్రులలో బెడ్స్ లభ్యత తెలుసుకోవడానికి క్రింది నంబర్లను సంప్రదించవచ్చు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ హెల్ప్‌లైన్: 104 (వైద్య సహాయం, ఉచిత సలహాలు)
ఏపీ కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్: 1902
కడప జిల్లా అగ్నిమాపక/అత్యవసర విభాగం: 101 (ఆసుపత్రుల అత్యవసర రవాణా సేవలకు)
జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్: 080– 46110007 (కరోనా సమయంలో భయాందోళన లు, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉచిత కౌన్సిలింగ్)
రోగనిరోధక శక్తిని పెంచే ఆహార జాగ్రత్తలు
విటమిన్–సి ఆహారాలు: నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి మరియు జామ పండ్లు రోజూ తీసుకోవాలి.
గోరువెచ్చని నీరు: రోజూ ఐదారు సార్లు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల తీవ్రత తగ్గుతుంది.
సమతుల్య ఆహారం: ఆకుకూరలు, కోడిగుడ్లు, పప్పుధాన్యాలు మరియు మొలకెత్తిన గింజలతో కూడిన ప్రొటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.


