కూటమి మనదే.. క్వారీఆన్‌ ! | - | Sakshi
Sakshi News home page

కూటమి మనదే.. క్వారీఆన్‌ !

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

కూటమి పెద్దలు సమాధానం చెప్పాలి : గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సంబేపల్లె శెట్టిపల్లెలో ఎటువంటి అనుమతులు లేకుండా

అడ్డగోలుగా గ్రానైట్‌ దోపిడీ

ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీగా దిమ్మెల నిల్వ

రాత్రివేళల్లో గుట్టుచప్పుడు

కాకుండా సరిహద్దులు దాటుతోన్న ఖనిజ సంపద

అధికారుల ‘నామమాత్రపు’ నిలుపుదలంతా కంటితుడుపు డ్రామానే

సంబేపల్లె: ప్రకృతి వనరులను నాశనం చేస్తూ, ప్రభుత్వ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ సంబేపల్లె మండలంలో మైనింగ్‌ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా మట్టి, ఇసుక, గ్రానైట్‌ వంటి అత్యంత విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన స్థానిక ముఖ్య నేతలు, కొందరు అధికారుల అండదండలతో ఈ దందా శ్రీమూడు పువ్వులు ఆరు కాయలుశ్రీగా సాగుతోంది.

11.50 ఎకరాల్లో అక్రమ క్వారీ.. ప్రభుత్వ భూమి ఆక్రమణ!

సంబేపల్లె మండల పరిధిలోని శెట్టిపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్‌ 2451లోని దాదాపు 11.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ అక్రమ గ్రానైట్‌ క్వారీ పనులు సాగుతున్నాయి. శెట్టిపల్లె వల్లబండపల్లె నుంచి ఝరికోన ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో ఈ దోపిడీ పర్వం నిరంతరాయంగా కొనసాగుతోంది. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న సర్వే నెంబర్‌ 2828 లోని ప్రభుత్వ పట్టా భూమిని సైతం అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్వారీకి సంబంధించిన భారీ మైనింగ్‌ యంత్రాలు, పరికరాలు, మరియు తవ్వితీసిన విలువైన గ్రానైట్‌ బ్లాక్‌ దిమ్మెలను ఈ ప్రభుత్వ స్థలంలోనే యథేచ్ఛగా నిల్వ ఉంచారు. సాధారణంగా ఒక గ్రానైట్‌ క్వారీని ఏర్పాటు చేయాలంటే మొదట మైనింగ్‌ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాతే మైనింగ్‌ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. కానీ, ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండానే కొండలను తవ్వేస్తున్నారు. గత కొన్ని మాసాలుగా రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో భారీగా గ్రానైట్‌ తవ్వకాలు జరుపుతూ, పగటిపూట అంతా సాధారణంగా ఉంచి, రాత్రి కాగానే గుట్టుచప్పుడు కాకుండా లారీల ద్వారా ఈ విలువైన గ్రానైట్‌ సంపదను ఇతర ప్రాంతాలకు, రాష్ట్ర సరిహద్దులు దాటించి కోట్లు కుమ్మేస్తున్నారు.

కంటితుడుపుగా అధికారుల

నిలుపుదల నాటకం

ఈ అక్రమ ఖనిజాల రవాణాపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, కొద్దిరోజుల కిందట మైనింగ్‌ అధికారులు క్వారీపై దాడులు నిర్వహించారు. ప్రస్తుతానికి క్వారీ పనులను నిలుపుదల చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నప్పటికీ, ఇది కేవలం కంటితుడుపు చర్యేనని విమర్శలు వస్తున్నాయి. మైనింగ్‌ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకుండా, తాత్కాలికంగా పనులు ఆపి సర్దుబాటు చేసేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇంత బహిరంగంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద కొల్లగొట్టబడుతున్నా, మైనింగ్‌ మరియు రెవెన్యూ శాఖ అధికారులు తమకేమీ తెలియనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శెట్టిపల్లె సమీపంలో అక్రమ మైనింగ్‌ చేస్తున్న ప్రాంతం

అక్రమంగా తరలించెందుకు సిద్దంగా దిమ్మెలు

రాయచోటి అర్బన్‌ : అక్రమ మైనింగ్‌పై కూటమి పెద్దలు సమాధానం చెప్పాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిలదీశారు. రాయచోటిలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల ఎకరాల పరిధిలో అక్రమ క్వారీయింగ్‌ సాగుతోందని ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాలపై తాము స్థానిక అధికారులను నిలదీయగా ‘ఇది పెద్దవాళ్ల విషయం.. నారా లోకేష్‌, సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయం.. మేము జోక్యం చేసుకోలేం్ఙ అని అంటున్నారని శ్రీకాంత్‌రెడ్డి సంచలన నిజాన్ని బయటపెట్టారు. నిజంగానే పాలకుల పేర్లు చెప్పుకుని రాష్ట్ర సంపదను దోచుకుంటుంటే, దీనిపై కూటమి పెద్దలు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్వారీ వద్ద ఏం జరుగుతుందో చూడటానికి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి వెళ్లిన వారిపై, ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన వారిపై మైనింగ్‌ మాఫియా దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. కాగా, రాయచోటి పట్టణం చుట్టూ ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లు వేసి క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రేపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం స్థలాలు స్వాధీనం చేసుకుంటాం, కట్టడాలను కూల్చివేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాయచోటి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌ బాషా, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్‌ ఖాన్‌, పట్టణ కన్వీనర్‌ నవాజ్‌ జుల్ఫికర్‌ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement