సరిహద్దులు దాటుతున్న బియ్యం | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులు దాటుతున్న బియ్యం

Jul 10 2026 5:16 AM | Updated on Jul 10 2026 5:16 AM

సాక్షి, మదనపల్లె : ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. మన రాష్ట్ర సరిహద్దులు దాటించి, పొరుగు రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మదనపల్లె నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న వాహనం బుధవారం రాత్రి పట్టుబడటంతో.. ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనితో అక్రమ దంగా యథేచ్ఛగా కొనసాగుతున్న విషయం బట్టబయలైంది. జూన్‌ ఒకటిన సాక్షిలో ప్రచురితమైన ‘దర్జాగా రేషన్‌ దందా’ కథనం అక్షరాల నిజమని నిరూపితమైంది. బుధవారం రాత్రి బి.కొత్తకోట మండలంలో పట్టుబడిన బియ్యం మదనపల్లె నుంచి తరలిస్తున్నట్టు స్పష్టమైంది. బి.కొత్తకోట, మదనపల్లె, బురకాయలకోట చాలా కాలంగా రేషన్‌ బియ్యం అక్రమ తరలింపు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యం పలుమార్లు అధికారుల దాడుల్లో పట్టుబడింది. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుకున్న బియ్యం అక్రమ తరలింపు వెనక నిందితుడి నుంచి అధికారులు వివరాలు సేకరించారు. మదనపల్లెలోని చంద్రా కాలనీకి చెందిన ముదివేడు అంజన కుమార్‌(34) డ్రైవర్‌ వృత్తితో జీవిస్తున్నాడు. ఈ వృత్తితో వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో రేషన్‌ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి విక్రయించుకుంటున్నాడు. ఇందులో భాగంగా బుధవారం అంజన కుమార్‌ మదనపల్లె పట్టణంలో ప్రజల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించాడు. కిలోకు రూ.18 చెల్లించి కొనుగోలు చేశాడు. అలా కొన్న 60 బస్తాల బియ్యం వాహనంతో కర్ణాటకలోని రాచెరువుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు వద్ద తిరుపతి విజిలెన్స్‌ ఎస్‌ఐ వెంకటరమణ, సిఎస్డీటి సుబ్బయ్య, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంజన కుమార్‌ తరలిస్తున్న వాహనంలో 2,890 కిలోల రేషన్‌ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ రూ.1,04,040గా నిర్ధారించారు. అంజన కుమార్‌ను అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో తాను కిలో రూ.18లకు రేషన్‌ బియ్యం సేకరించి కర్ణాటకలోని రాచెరువుకు చెందిన కోళ్ల ఫారం యజమానులకు కిలో రూ.25తో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ చిన్న బాలాజీ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బి.కొత్తకోట సరఫరాల గోడౌనుకు అప్పగించారు. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement