రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, వీరు పాలకులా లేక నయవంచకులా అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణం ఎస్‌ఎన్ కాలనీలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా తాము ఏం చేశామని చెప్పుకోలేని దయనీయ పరిస్థితిలో ఉందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తిరువూరు ఎమ్మెల్యే, పోలవరం జనసేన ఎమ్మెల్యేలు ప్రస్తుతం కూటమిలోనే కొనసాగుతూ.. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, ఏ వ్యవస్థ కూడా సరిగా లేదని నిలదీస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వరకు అందరూ కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని అణచివేయాలనే ఏకై క ధోరణితో ముందుకు వెళ్తున్నారని, మీడియా, యూట్యూబ్ స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, కూటమి ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికేట్లను ఆపేశాయన్నారు. ఉద్యోగాలు వచ్చినా సర్టిఫికేట్లు తీసుకోవడానికి చాలా మంది తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టి ఫీజులు చెల్లిస్తున్నారని, కొందరు డబ్బులు లేక వచ్చిన ఉద్యోగాలనే వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా.. అటు మహిళలను, ఇటు అన్నదాతలను కూడా మోసం చేశారన్నారు. ఆస్తులను పెంచుకోవాల్సిన ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూటమి నేతలు తమ బినామీలకు ధారాదత్తం చేస్తున్నారని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు.
పవన్‌కల్యాణ్ తీరు విస్మయం
గతంలో సుగాలి ప్రీతి కేసుపై ఆవేదన వ్యక్తం చేసి, అధికారంలోకి వస్తే వారంలోనే న్యాయం చేస్తామన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక సాక్ష్యాల మార్పిడి జరిగిందని మాట్లాడటంపై శ్రీకాంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జ్ఞానేశ్వర్, సుగాలి ప్రీతి, సాయికృష్ణ, క్రాంతి ఘటనల తరహాలోనే అరాచక పాలన సాగుతోందన్నారు.
నాడు ‘ప్రాణం అడ్డుపెడతా’నని..
నేడు తప్పుడు కేసులు!
నాయకుడనే వాడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. గతంలో లక్కిరెడ్డిపల్లెకు చెందిన గంగాధర్ అనే బాధితుడు తన భూమి సమస్యను చంద్రబాబుకు వివరించగా.. ‘నీ ప్రాణం కోసం అవసరమైతే నా ప్రాణం అడ్డుపెట్టి అయినా నిన్ను కాపాడతాను.. ఎస్పీ చేత కాళ్లు పట్టిస్తా‘ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆనాటి పాత వీడియో సాక్ష్యాలను శ్రీకాంత్ రెడ్డి విలేకరులకు చూపించారు. కానీ ఈ రోజు అదే గంగాధర్ తన సమస్యను చెప్పుకోవడానికి విజయవాడ వెళ్తే, అతనిపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో సదరు భూకబ్జా నేతను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు.. ఈ రోజు అదే నాయకుడికి పచ్చ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని పునీతుడిని చేశారని ఎద్దేవా చేశారు. చివరకు లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్‌లో సీఐతో ప్రెస్‌మీట్ పెట్టించి, బాధితుడైన గంగాధర్‌దే తప్పు అని చెప్పించే దారుణమైన పరిస్థితికి దిగజారారని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి


