మదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను పాము కాటేసింది. ఈ సంఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబీకులు గురువారం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వలసపల్లి గ్రామం ఎరబల్లెకు చెందిన సురేంద్ర భార్య గంగులమ్మ(46) ఊరి సమీపంలోని వ్యవసాయ పొలంలో పాడి పశువులను మేపుకొంటూ ఉండగా విష సర్పం కాలిపై కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది.
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
పుంగనూరు : గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సంబంధించి రాగి కేబుల్ వైర్లను దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే 300 కేజిల రాగి కమ్మిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఎస్‌ఐ అన్సర్‌బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఖలీల్, అనిల్ రాత్రి పూట కేబుల్ వైర్లు చోరీ చేసే వారు. దీనిపై రైతుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని కర్ణాటక సరిహద్దుల్లో పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణం దేవళంవీధిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్‌టౌన్ పోలీసులు దాడులు జరిపి ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేశారు. ఎస్‌ఐ రహీముల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని దేవళం వీధిలో వెంటనే సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని ఎస్‌ఐ తెలిపారు. ఓ ఇంటి వరండాలో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకుని.. వారి నుంచి రూ.15 వేల నగదు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించి ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గాయపడిన యువకుడి మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం మూగవాడి గ్రామ పంచాయతీ గొల్లపల్లెకి చెందిన హరీష్(25) పని నిమిత్తం ఎర్రప్పల్లె వెళ్తుండగా బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుని ఢీకొని తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మదనపల్లికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
అనుమతిలేని లేఔట్లకు ప్లాన్లు వేయొద్దు
సాక్షి, మదనపల్లె : పీకేఎం ఉడా పరిధిలో అనుమతి లేకుండా వేసిన ప్లాట్లు, లేఔట్లకు సంబంధించిన స్థలాలకు ప్లాన్లు వేసి అనుమతుల కోసం ప్రతిపాదించవద్దని పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్‌టీపీఎస్)ను చైర్మన్ బీఆర్.సురేష్‌బాబు స్పష్టంగా ఆదేశించారు. గురువారం స్థానిక సంస్థ కార్యాలయంలో ఎల్‌టీపీఎస్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట నిబంధనలు పాటించకుండా లేఔట్లు వేసిన వారు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని అన్నారు. వీరు చెల్లించాల్సిన రుసుములు, భూ అప్పగింత, ల్యాండ్ కన్వర్షన్ ఇవేమి లేకుండా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి స్థలాల విక్రయాలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల స్థానిక సంస్థలకు, పట్టణాభివృద్ధి సంస్థకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, బి.కొత్తకోట మున్సిపాలిటీలకు చెందిన ఎల్‌టీపీఎస్‌లు, కార్యదర్శి పీఆర్.మనోహర్, ఏఓ చిట్టిబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


