● మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలి
● వైఎస్‌ఆర్‌సీపీ బీసీ నేతల డిమాండ్
సాక్షి, మదనపల్లె : కూటమి పాలనలో బీసీలకు రక్షణ కరువైందని, అకారణంగా హత్యలకు గురవుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడు బురుగుల సుబ్రహ్మణ్యం, మదనపల్లె బీసీసెల్ అధ్యక్షుడు ఆవుల విశ్వనాథ అన్నారు. గురువారం స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒంగోలులో క్షురవృత్తితో జీవనం సాగిస్తున్న గుడివాడకు చెందిన గరిటపల్లి మహేంద్రను మద్యం మత్తులో నాగినేని రామారావు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య గురైన మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించి, నిందితుడిని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీల రక్షణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మహేంద్ర హత్యతో తల్లి, భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఆధారం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు భరోసా ఉండేదన్నారు. సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేస్తే కూటమి పాలనలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. సమావేశంలో భజంత్రీ శ్రీరాములు, భజంత్రీ మల్లికార్జున, ఆవుల వినోద్ కుమార్, మంజునాథ పాల్గొన్నారు.


