ఎల్‌నినో..ఎదుర్కొనేలా.. | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో..ఎదుర్కొనేలా..

Jul 9 2026 6:17 AM | Updated on Jul 9 2026 6:17 AM

28 వేలఎకరాల్లో పచ్చగడ్డి సాగు

330 టన్నుల గడ్డి విత్తనాలు

పంపిణీకి సిద్ధం

సాగులో ఉన్న పచ్చగడ్డి గడ్డికోత యంత్రాలు

సాక్షి, మదనపల్లె: జిల్లాపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండగా, వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలో పాడి కీలకమైంది. పాడిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాభావం వల్ల పశువులు, గేదెలు, గొర్రెలకు పశుగ్రాసం కొరత ఏర్పడనుంది. పశుగ్రాసం అందుబాటులోకి రాని పక్షంలో తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది. దీనిపై అప్రమత్తమైన అధికారులు వచ్చే ఏడాదికి ఖరీఫ్‌ నాటికి పచ్చగడ్డి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

28 వేల ఎకరాల్లో సాగు

25 మండలాల్లో పచ్చగడ్డి సాగు చేసేందుకు 330 టన్నుల గడ్డి విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. ఒక టన్ను గడ్డి విత్తనంతో 70 ఎకరాల్లో గడ్డి సాగు చేయవచ్చు. ఈ విత్తనాలతో 28,000 ఎకరాల్లో పచ్చగడ్డి సాగు చేయాలని నిర్ణయించారు. గడ్డి విత్తనాలను 75 శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నారు. వీటిని విత్తితే 45 నుంచి 60 రోజుల్లో గడ్డి వస్తుంది. దీనికి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి. జిల్లాలో 100 శాతం రాయితీతో వార్షిక పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద వీటిని మంజూరు చేసేందుకు రైతులు సంబంధిత మండల ఏపీవోకు దరఖాస్తులు చేసుకోవాలి. తర్వాత మంజూరు లభిస్తుంది.

గడ్డి కోత యంత్రాలు

రైతులు పచ్చగడ్డినే కాకుండా వ్యవసాయ ఉప ఉత్పత్తులైన రాగులు, జొన్నలు, సద్దలు, అలసంద ఉలవలు, వేరుశనగ ఎండుకట్టెను గడ్డిగా వినియోగించినందుకు వీలుంటుంది. వీటిని కత్తిరించాలంటే గడ్డి కోత యంత్రాలు అవసరం. జిల్లాలో ఇప్పటికే 900 యంత్రాలు రైతులకు అందించారు. ఇంకా అవసరమైన రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రోజుకు ఒక పశువుకు ఐదు కిలోల గడ్డి అవసరం. జిల్లాలో 2,87,713 పశువులు, 21,440 గేదెలు ఉన్నాయి. వీటితోపాటు గొర్రెలకు కూడా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే 20 వేల ఎకరాల్లో

జిల్లాలో ప్రస్తుతం 20 వేల ఎకరాల్లో పచ్చగడ్డి సాగవుతోందని పశుసంవర్ధక శాఖ లెక్కలు సిద్ధం చేసింది. ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులే పండిస్తున్న పచ్చగడ్డి. 2024–25 లో రెండు వేల ఎకరాల్లో సాగవగా గత ఏడాది ఏడు వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం అత్యధికంగా సాగులో ఉంది. ఈ ప్రణాళికతో జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికి పచ్చగడికి సమస్య తలెత్తకుండా ఉండేలా ఈ చర్యలను పశుసంవర్దకశాఖ చేపట్టిందని జిల్లా అధికారి గుణశేఖర్‌ పిళ్లై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement