● ఓటర్ల పరిశీలన జరిగిందా.
● ఎస్‌ఐఆర్‌లో కలెక్టర్ నిశాంత్‌కుమార్
పుంగనూరు: హలో..నేను మీ కలెక్టర్‌ను మాట్లాడుతున్నా...బీఎల్‌వో మీ ఇంటికి వచ్చాడా....ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారా....సమస్యలు ఉన్నాయా అంటూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఎస్‌ఐఆర్ గడువు ముగుస్తుండటంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో వణుకు పుట్టించింది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని 146 , 148 పోలింగ్ కేంద్రాలను బధవారం కలెక్టర్ పరిశీలించి ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ఓటర్లకు నేరుగా ఫోన్లు చేసి ఎన్యూమరేషన్‌పై వివరాలు సేకరించి, పలు సూచనలు చేశారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తొలిసారిగా కలెక్టర్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
అంగన్‌వాడీ తనిఖీ
సోమల మండలంలోని వడ్డిపల్లె ,కొత్తపల్లె అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ తనిఖీ చేశారు. మరమ్మతు పనులను పరిశీలించారు. మండలంలో 8 పనులు మంజూరైతే 6 పనులు మాత్రమే పూర్తి కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. సోమల మండలంలోని కందూరువంక ఆనకట్ట నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ఈఈ వెంకట్రామయ్య, డీఈఈ తదితరులు పాల్గొన్నారు.


