రామసముద్రం : రామసముద్రం మండల పరిధిలోని ఎర్రపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఎం.గొల్లపల్లి గ్రామానికి చెందిన హరీష్ (25) ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హరీష్ తలకు తీవ్ర రక్త గాయం అయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లారీ ఢీ – ఒకరికి
తీవ్ర గాయాలు
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి దేవపట్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగేనాయక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకొంది. స్థానికుల వివరాలమేరకు రెడ్డివారిపల్లె గ్రామం యర్రదిన్నెలబిడికి చెందిన మంగేనాయక్ కూలి పనులు చేసుకొంటు జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి దేవపట్ల బస్టాపు వద్ద నడుచుకొంటూ రోడ్డు దాటుతుండగా రాయచోటి వైపు నుంచి పీలేరు వైపు వెళుతున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన మంగేనాయక్‌ను 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మూడు వాహనాలను
ఢీకొట్టిన బొలెరో
మదనపల్లె టౌన్ : స్పీడు మీద వెళుతున్న బొలెరో వాహనాన్ని వర్షంలో డ్రైవర్ బ్రేక్ కొట్టడంతో అదుపు తప్పి మూడు వాహనాలను ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె బైపాస్ రోడ్డులో జరిగింది. ఘటనపై తాలూక ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన శ్రీనివాసులు విజయవాడ నుంచి మదనపల్లెకు బొలెరోలో వస్తుండగా స్థానిక బైపాస్ రోడ్ వద్దకు రాగానే వర్షం కురిసింది. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీస్ వాహనంతో పాటు మరో రెండు కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరే మరో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తాలూక ఎస్‌ఐ తెలిపారు. మూడు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు.
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని సాయికుటీర్ రోడ్డులో శరణ్య (21) అనే బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శేఖర్, లక్ష్మీదేవి దంపతులు సున్నంబట్టివీధిలో పిండి మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె శరణ్య కర్నూల్‌లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి రెండు నెలలు సెలవులు ఇవ్వడంతో శరణ్య ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం తల్లిదండ్రులు పిండి మిషన్ వద్దకు వెళ్లి ఇంటికి వచ్చారు. గది తలుపులు వేసుకొని లోపల ఉన్న శరణ్యను పిలవగా పలలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పక్కనే ఉన్న కిటికిలో నుంచి చూడగా కుమార్తె ఫ్యాన్‌కు ఉరేసుకొని వేలాడుతోంది. వెంటనే తలుపులు పగులకొట్టి శరణ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యుడు నిర్ధారించాడు. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు బుధ వారం పోలీసులు కేసు నమోదు చేశారు.


