● జిల్లాలో రూ. 12.67 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ
● బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగింత
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్ : ‘ఆపరేషన్ మొబి ట్రాక్‘ ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్‌న్‌లో సఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్) పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా, 9వ విడతలో భాగంగా రికవరీ చేసిన 610 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 1,22,00,000 ఉంటుందని ఎస్పీ అన్నారు. ఇప్పటి వరకు 9 విడతల్లో మొత్తం రూ.12,67,50,000 విలువైన 6487 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. మొబైల్ రికవరీలో రాష్ట్రస్థాయిలోనే కడప జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్–ఇన్‌స్పెక్టర్ ఏ. మధు మల్లేశ్వర రెడ్డి, రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఓ. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ టి.రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.


