మదనపల్లె టౌన్ : టీబీ నిర్మూలన (టీబీఎంబీఏ 2.0)కు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.లక్ష్మినరసయ్య అన్నారు. బుధవారం మదనపల్లె డీఎంహెచ్‌వో కార్యాలయంలో అదనపు డీఎంహెచ్‌వో డా.రాధిక తో కలసి జిల్లాలోని టీబీ యూనిట్ల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీబీ కేసులను ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకమన్నారు. గ్రామాలు, పట్టణాలు, పారిశ్రామిక, గిరిజన ప్రాంతాల్లో అధిక ప్రమాదం ఉన్న ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రెండు వారాలకుపైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి టీబీ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించి, లక్షణాలున్న వారిని వెంటనే పరీక్షలకు పంపించాలని ఆదేశించారు.
చికిత్సలు మధ్యలో ఆపొద్దు
టీబీ రోగులు మధ్యలో చికిత్సను నిలిపివేయకుండా ప్రతి రోగిని క్రమం తప్పకుండా పర్యవేక్షించి, డ్రాప్‌అవుట్స్‌ను పూర్తిగా నివారించాలని సూచించారు. చికిత్స పూర్తి చేయించడం ద్వారానే టీబీ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నిక్షయ్ పోర్టల్‌లో నమోదులు, ఫాలోఅప్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, గృహ సందర్శనల్లో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
టీబీఎంబీఏ 2.0 ప్రతిష్టాత్మకం
అదనపు డీఎంహెచ్‌వో డా. రాధిక మాట్లాడుతూ.. టీబీఎంబీఏ 2.0 దేశ అత్యున్నత స్థాయిలో సమీక్షించ బడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమమని తెలిపారు. హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే ద్వారా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఛాతీ ఎక్స్‌రే నిర్వహించి, అనుమానితులను వెంటనే కఫ పరీక్షలు, నాట్ పరీక్షలకు పంపాలని సూచించారు.


