మదనపల్లె టౌన్ : అప్పు లావాదేవీల వివాదంలో ఓ మహిళ ఇంటిపైకి వెళ్లి దాడి చేసి, బెదిరించి, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్న కేసులో బహు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు సహా మరో ముగ్గరిని బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ రాజారెడ్డి మీడియాకు తెలిపిన వివరాలు.. పట్టణంలోని వివేకానంద నగర్, వినాయకుని ఆలయం వెనుకన నివాసముంటున్న కళావతి (44) పెద్ద కుమారుడు అనిల్ కుమార్ భవనాలకు బైండింగ్ పనులు చేస్తుంటాడు. చిన్న కుమారుడు వినోద్ కుమార్ ఎలక్ట్రికల్ ఆపరేటర్ గా పనిచేస్తాడు. ఈ క్రమంలో అనిల్ కుమార్ తన స్నేహితుడైన చీకిలగుట్టకు చెందిన నరేంద్ర వద్ద రూ.1లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ అప్పులో రూ.70వేలు వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాడు. అయితే మిగిలిన రూ.30వేల కోసం నరేంద్ర, అతని తల్లి రమణమ్మ, తండ్రి గంగులప్ప రామారావు కాలనీ, చీకిలగుట్టకు చెందిన చంద్రశేఖర్ అలియాస్ శ్రీచందు ప్రోద్బలంతో గత ఏడాది మార్చి 28న కళావతి ఇంటిపైకి వచ్చి వీరంతా మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని దూషించి, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ మర్యాదకు భంగం కలిగించడమే కాకుండా తన కుమారుడిని రుణ గ్రహీతగా, అతని స్నేహితుడిని సాక్షిగా పెట్టి రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లపై, రూ.1.85 లక్షలకు మరో ప్రామిసరీ నోటుపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు పెట్టిన కేసులో నిందితులు పలక నరేంద్ర, పలక రమణమ్మ, పలక గంగులప్ప, బొంతలపల్లె చంద్రశేఖర్ అలియాస్ శ్రీచందులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీచందుతో పాటు పలక నరేంద్ర కుమార్ వద్ద ఐదు ఖాలీ బాండ్లను సీజ్ చేసి నలుగురిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరచడంతో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
మరో ముగ్గురు కూడా..


