ఆర్‌వోబీ పనుల పురోగతిపై డీఈ, సీఐ మధ్య వాగ్వాదం
పీలేరు రూరల్ : పీలేరు పట్టణంలో జరుగుతున్న ఆర్‌వోబీ నిర్మాణ పనుల పురోగతి విషయంలో చిత్తూరు ఎన్‌హెచ్ డీఈ జి.సుజాత, పీలేరు సీఐ యుగంధర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. మంగళవారం స్థానిక మదనపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఆర్‌వోబీ నిర్మాణ పనులు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ యుగందర్ మాట్లాడుతూ ఆర్‌వోబీ పనులు ఆలస్యం అవుతున్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పనులు వేగవంతానికి జాతీయ రహదారుల శాఖ బాధ్యత తీసుకోవాలంటూ గట్టిగా వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ ప్రశ్నించారు. ప్రత్నామ్నాయ మార్గం చూపకుండా పనుల ఆలస్యంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఎవరికై నా ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టరు తోపాటు అధికారులపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఎన్‌ఎహెచ్ డీఈ సుజాత కంటతడి పెట్టుకున్నారు. నలుగురి మధ్య ఓ మహిళా ఉద్యోగితో ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ వ్యవహార శైలిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామంటూ అక్కడి నుంచి ఆమె వెళ్లి పోయారు. స్థానిక టీడీపీ నాయకులు డీఈని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆర్‌వోబీ పనుల ఆలస్యం కారణంగా జరుగుతున్న వరుస ప్రమాదాలతో సీఐ అలా మాట్లాడారంటూ, జరిగిన సంఘటన పక్కన పెట్టి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కోరారు.
సీఐ దురుసుగా మాట్లాడారంటూ కన్నీళ్లు పెట్టుకున్న డీఈ
కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్న మహిళా ఉద్యోగి
డీఈని బుజ్జగించిన టీడీపీ నాయకులు


