వేతనాలకు రామ్‌ రామ్‌ | - | Sakshi
Sakshi News home page

వేతనాలకు రామ్‌ రామ్‌

Mar 5 2026 7:31 AM | Updated on Mar 5 2026 7:31 AM

●స్పష్టత లేదు

ఏప్రిల్‌ ఒకటి నుంచి వీబీ జీ రాం జీ పథకం

19 వేల పనులు రద్దయ్యే పరిస్థితులు

జిల్లాలో అభివృద్ధి పనులకు

రూ.46.61 కోట్లు, కూలీలకు రూ.20.43 కోట్లు పెండింగ్‌

మదనపల్లె : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వరూపం మారిపోనుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా వీబీ జీ రాం జీ పథకం తీసుకురావడంతో ఉపాధి పనులకు గండం ఏర్పడింది. ఇప్పటిదాకా అన్నమయ్య జిల్లాలో మంజూరు చేసి చేపట్టిన పనులు ఇంకా పూర్తి కాలేదు. గత చట్టానికి భిన్నంగా కొత్త చట్టం ఉండడంతో మంజూరైన పనులు పూర్తిగా రద్దయ్య అవకాశం నెలకొంది. ఈ పరిస్థితుల్లో కూలీలు చేసిన పనులకు వేతనాలు, అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మార్చి 31 నాటికి చేపట్టిన పనులు, మంజూరైన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక మిగిలింది రోజులే కావడంతో జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికార యంత్రాంగం ఆందోళనలో ఉంది.

19 వేల పనులపై ప్రభావం

జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు ఉపాధి కల్పిస్తూ 60,555 పనులు మంజూరు చేశా రు. వీటిలో ఫిబ్రవరి 28 నాటికి 40,880 పనులు పూర్తి చేశారు. ఇంకా 19,708 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని చేపట్టి పూర్తి చేయాల్సినప్పటికీ సమయం లేదు. పథకంలో మార్పుల కారణంగా కోట్లాది నిధులను సద్వినియోగం చేసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేయకపోతే రద్దయ్యే అవకాశం ఉంది.

పనులకు రూ.46 కోట్లు

జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది రూ.60.08 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో గ్రామ సచివాలయాలు, భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లు, పల్లె పండుగ సిమెంట్‌ రోడ్లు, హార్టికల్చర్‌, గృహ నిర్మాణానికి 90 రోజుల పనులు, ఇంకుడు గుంతల తవ్వకం, కంపోస్టు ఎరువులు తయారీ ఉన్నాయి. ఇప్పటిదాకా చేపట్టిన పనుల్లో రూ.13.46 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.46.61 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త పథకం అమలులోకి రానుండడంతో వీటి బిల్లుల చెల్లింపు ప్రశ్నార్థకంగా మారింది.

కూలీలకు రూ.20 కోట్లు

అన్నమయ్య జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు గత నవంబర్‌ నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. దాంతో రూ.20.43 కోట్ల వేతనాలు పెండింగ్‌లో పడ్డా యి. వీటిలో అత్యధికంగా వీరబల్లిలో రూ.1.45 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

పల్లె పండుగ పడకేసింది

ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేసుకొని ఉపాధి నిధులతో పల్లె పండగ పేరు పెట్టి గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లను నిర్మించింది. జిల్లాలో రూ.72.79 కోట్లతో 979 పనులను మంజూరు చేసి, 1,67,042 మీటర్ల రోడ్డు నిర్మించాలని మంజూరు చేశారు. ఇప్పటిదాకా రూ.12.29 కోట్లతో 129 పనులే పూర్తి చేసి 29,076 మీటర్ల సిమెంట్‌ రోడ్డు మాత్రమే నిర్మించారు. మిగిలిన పనులన్నీ పెండింగ్‌ ఉన్నాయి.

ఐరిష్‌ హాజరు

ఉపాధి హామీ పథకం అమలులో మార్పులు తేవడంతో ఇప్పుడు ప్రతి కూలీకి ఐరిష్‌ ద్వారా హాజరును నమోదు చేయాల్సిన నిబంధన అమలులోకి వచ్చింది. దాంతో పనులకు హజరయ్యే కూలీల హాజరును తప్పనిసరిగా ఐరిష్‌ ద్వారానే నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తనున్నాయి. దాంతో కూలీల హాజరుపై ప్రభావం చూపుతోంది. ఈ సమస్య కొనసాగితే ఉపాధి పనులు చేపట్టడంపై ప్రభావితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కొత్త పథకంపై అవగాహన

వీబీజీ రాం జీ పథకంపై కూలీలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఫిబ్రవరి 28 నుంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ప్రారంభం ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 125 రోజులు పనిదినాలు కల్పిస్తారు. కూలీలకు చెల్లింపులు ఆలస్యం అయితే ఆలస్యపు పరిహారం ఇచ్చే విధానం అమలులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులపై కేంద్రం నుంచి స్పష్టత లేదు. ఈ పనులు, మంజూరైన నిధులు రద్దు చేస్తారా లేదా అని తెలియడం లేదు. ప్రస్తుతానికి అమలులోకి పనులన్నింటిని ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న ఆదేశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

– వెంకటరత్నం, డ్వామా పీడీ, మదనపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement