పది పరీక్షల్లో పదికి పది | - | Sakshi
Sakshi News home page

పది పరీక్షల్లో పదికి పది

Mar 6 2026 8:21 AM | Updated on Mar 6 2026 8:21 AM

పది పరీక్షల్లో పదికి పది

నిపుణులైన ఉపాధ్యాయుల విజయ సూత్రాలు!

తెలుగు: భాషా పరిజ్ఞానంతోనే వెలుగు

జీవశాస్త్రం : బొమ్మలే జీవం

సాంఘికశాస్త్రం : పటగుర్తింపే అస్త్రం

ఇంగ్లీష్‌ : గ్రామర్‌తోనే గ్లామర్‌

తెలుగు సబ్జెక్టులో పదికి పది మార్కులు సాధించడానికి అమూల్యమైన సూచనలు:

1. అవగాహన – ప్రతిస్పందన: ఈ విభాగంలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు అసంపూర్తిగా కాకుండా, పూర్తి వాక్యాలలో స్పష్టంగా రాయాలి.

2. సమాధానాల సరళి: పద్యభాగం, గద్యభాగం మరియు ఉపవాచకం నుండి అడిగే లఘు, వ్యాసరూప మరియు సృజనాత్మక ప్రశ్నలకు ఆయా ప్రశ్నల స్వభావాన్ని బట్టి, అడిగిన పరిధి మేరకు సమాధానాలు రాయాలి.

3. భాషాంశాలు – వ్యాకరణం: పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠం చివర ఉండే అభ్యాసాలను క్షుణ్ణంగా చదవాలి. పుస్తకం చివర ఇచ్చే పదవిజ్ఞానం, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, మరియు ప్రకృతి–వికృతి పదాలపై పట్టు సాధిస్తే భాషాంశాల్లో పూర్తి మార్కులు పొందవచ్చు.

4. బహుళైచ్ఛిక ప్రశ్నలు: జవాబులు రాసేటప్పుడు కేవలం ‘అ, ఆ, ఇ, ఈ’ వంటి ఐచ్ఛికాలను గుర్తించడమే కాకుండా, వాటికి సంబంధించిన పదాలను కూడా రాయడం మంచిది.

5. ప్రణాళికాబద్ధమైన సాధన: పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ‘నూరు రోజుల ప్రణాళిక’లోని ప్రశ్నలను మరియు అందులోని 3 మోడల్‌ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి.

6. ప్రెజెంటేషన్‌ టిప్స్‌: చక్కని దస్తూరి కలిగి ఉండాలి. విరామ చిహ్నాలను పాటిస్తూ, అక్షర దోషాలు లేకుండా రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. – గంగనపల్లి వెంకటరమణ,

ప్రధానోపాధ్యాయులు (FAC),

జడ్పీహెచ్‌ఎస్‌ నాగిరెడ్డిపల్లి, నందలూరు మండలం

పది పబ్లిక్‌ పరీక్షల్లో సాంఘిక శాస్త్రంలో గరిష్ట మార్కులు సాధించడంపై కీలక సూచనలు

1. బ్లూ ప్రింట్‌ విశ్లేషణ: విద్యాశాఖ అందించిన బ్లూ ప్రింట్‌ ప్రకారం పాఠ్యాంశాలను మార్కుల కేటాయింపు ఆధారంగా విభజించుకోవాలి. ఎక్కువ మార్కులు వచ్చే పాఠ్యాంశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చదవాలి.

2. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు): సెక్షన్‌–1లోని 12 ఒక మార్కు ప్రశ్నలు, సెక్షన్‌–2లోని 8 రెండు మార్కుల ప్రశ్నలపై పట్టు సాధించాలి. ఇవి నేర్చుకోవడానికి తక్కువ సమయం పడుతుంది కాబట్టి వీటిని పదే పదే పునశ్చరణ చేయాలి.

3. పట నైపుణ్యాలు : ప్రశ్నపత్రంలోని గ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలు, పట నైపుణ్యాల ప్రశ్నలను తప్పులు లేకుండా రాసేలా బాగా సాధన చేయాలి. ఇవి సులభంగా మార్కులు తెచ్చిపెట్టే విభాగాలు.

4. 8 మార్కుల ప్రశ్నల వ్యూహం (40 మార్కులు): సెక్షన్‌–4లో ఉండే 5 ఎనిమిది మార్కుల ప్రశ్నలకు (5 ్ఠ8=40) ప్రణాళికాబద్ధంగా సమాధానాలు సిద్ధం చేసుకోవాలి. వీటిపై పట్టు సాధిస్తే ప్రతి విద్యార్థి 60కి పైగా మార్కులు పొందవచ్చు.

5. 100/100 లక్ష్యంగా: పూర్తిగా 100 మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు సెక్షన్‌–3లోని 8 నాలుగు మార్కుల ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పాఠ్యాంశాల వారీగా వీటిని విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి. ప్రస్తుత వర్తమాన వ్యవహారాలపై అవగాహన కలిగి ఉండటం అదనపు ప్రయోజనం .–ఓబులేసు,జెడ్పీ హైస్కూల్‌, బోయినపల్లి

ఇంగ్లీష్‌ సబ్జెక్టులో అత్యధిక మార్కులు సాధించడానికి సూచనలు

1. ప్రశ్నపత్రంపై అవగాహన: ప్రశ్నాపత్రాన్ని మొదట పూర్తిగా, నిశ్చితంగా చదవాలి.

కాంప్రహెన్షన్‌ ప్యాసేజ్‌: వీటిని సాధించేటప్పుడు "Interrogative Pronouns" ( What, When, Which, Why, How) యొక్క అర్థాలను సరిగ్గా అర్థం చేసుకుంటే సమాధానాలు వెతకడం సులభమవుతుంది.

2. సమాధానాల క్రమం: జవాబులు రాసేటప్పుడు ప్రశ్నల క్రమం మిస్‌ కాకుండా జాగ్రత్త పడాలి. ఇది వాల్యుయేషన్‌ చేసేవారికి అనుకూలంగా ఉంటుంది.

3. టెక్చువల్‌ గ్రామర్‌: ప్రతి పాఠం చివరలో ఉండే గ్రామర్‌ అంశాలను క్షుణ్ణంగా ప్రాక్టీస్‌ చేయాలి. పరీక్షలో ఇవి చాలా కీలకం.

4. స్పెల్లింగ్‌ పంక్చుయేషన్‌: స్పెల్లింగ్‌ తప్పులు లేకుండా రాయాలి. సరైన విరామ చిహ్నాలను పాటించడం వల్ల ప్రెజెంటేషన్‌ బాగుంటుంది.

5. పాత్రల గుర్తింపు: ప్రతి పాఠంలోని ముఖ్యమైన పాత్రలను, వారి స్వభావాలను గుర్తుంచుకోవాలి. దీనివల్ల అనలిటికల్‌ ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాయవచ్చు.

6. క్రియేటివ్‌ రైటింగ్‌: డిస్కోర్సెస్‌ లేదా క్రియేటివ్‌ రైటింగ్‌లో గరిష్ట మార్కులు సాధించాలంటే, సమాధానం కనీసం రెండు పేజీలకు తగ్గకుండా, స్పష్టమైన ఫార్మాట్‌లో ఉండాలి.

– గంగయ్య, ఎస్‌ఏ ఇంగ్లీష్‌, జెడ్పీ హైస్కూల్‌,

సిద్దవరం, పోరుమామిళ్ల మండలం

1. మొదటి యూనిట్‌ (జీవక్రియలు) – అత్యంత కీలకం: జీవక్రియల యూనిట్‌ నుంచి అత్యధిక ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనిని పూర్తిగా చదవాలి.

ఈ విభాగం నుండి: ఒక 8 మార్కుల ప్రశ్న (ప్రయోగాలు). రెండు 4 మార్కుల ప్రశ్నలు.

రెండు 2 మార్కుల ప్రశ్నలు. రెండు 1 మార్కు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

2. అనువంశికత: ఈ యూనిట్‌ నుంచి సులభంగా 10 మార్కులు సాధించవచ్చు. ఇందులో ఉన్న మూడు 8 మార్కుల ప్రశ్నల నుండి ఒకటి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. అలాగే దృశ్యరూప, జన్యురూప నిష్పత్తులు మరియు సంక్షిప్త పదాల విస్తరణపై దృష్టి పెట్టాలి.

3. మన పర్యావరణం: ఈ యూనిట్‌ నుంచి 4 మార్కుల ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.

ఓజోన్‌ పొర క్షీణత. బయో డీగ్రేడబుల్‌ మరియు నాన్‌–బయో డీగ్రేడబుల్‌ అంశాలు.

వీటితో పాటు ఒక 2 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది.

4. ముఖ్యమైన చిత్రాలు: పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి ఈ క్రింది చిత్రాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి:

యూనిట్‌ 1: విసర్జన వ్యవస్థ, నెఫ్రాన్‌ నిర్మాణం.

యూనిట్‌ 3: పుష్పం నిలువు కోత, సీ్త్ర ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పుష్ప ఫలదీకరణ చిత్రం. ఎస్‌సిఇఆర్‌టి విడుదల చేసిన మోడల్‌ పేపర్లను పరిశీలించాలి. – శ్రీధర్‌రావు, జీవశాస్త్రం,

ఎంసీహెచ్‌ఎస్‌, నాగరాజుపేల, కడప.

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రతి సబ్జెక్టులోనూ ‘జిపిఏ 10’ సాధించవచ్చని జిల్లాలోని వివిధ పాఠశాలల నిపుణులైన ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 167 పరీక్ష కేంద్రాల్లో 28,152 మంది పరీక్షలు రాయబోతున్నారు. సబ్జెక్టుల వారీగా వారు అందించిన కీలక వ్యూహాలు ఇవే: –కడప ఎడ్యుకేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement