నియామకం | - | Sakshi
Sakshi News home page

నియామకం

Mar 5 2026 7:31 AM | Updated on Mar 5 2026 7:31 AM

సాక్షి అన్నమయ్య : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రైల్వేకోడూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సహదేవరెడ్డి, పీలేరుకు డి.ఉదయ్‌కుమార్‌, రాయచోటికి చొప్పా యల్లారెడ్డి, మదనపల్లెకు ఎన్‌.అనీషారెడ్డి, తంబళ్లపల్లెకు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రాజంపేటకు పడమటికోన దేవనాథరెడ్డి నియమితులయ్యారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్‌ కో ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరిస్తారు.

రామసముద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

మదనపల్లెటౌన్‌: మదనపల్లె నియోజకవర్గంలో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై బుధవారం సస్సెన్షన్‌ వేటు పడింది. రామసముద్రం పోలీస్‌ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ కిరణ్‌, కానిస్టేబుల్‌ కిరణ్‌ ఓ కేసు విషయంలో ఫిర్యాది దగ్గర డబ్బు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి దృష్టికి వెళ్లిందని అడిషనల్‌ ఎస్పీ వేంకటాద్రి తెలిపారు. దీనిపై విచారించిన ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారని పేర్కొన్నారు.

మినరల్స్‌ క్వారీపై ప్రజాభిప్రాయసేకరణ

రాజంపేట: తాళ్లపాక రెవెన్యూ పొలంలోని 1275 సర్వే నంబర్‌లో ఎంజీపురంలో ఎస్‌ఎల్వీమైన్స్‌ అండ్‌ మినరల్స్‌ దరఖాస్తు చేసుకున్న క్రమంలో బుధవారం సబ్‌కలెక్టర్‌ భావన ప్రజాభిప్రాయసేకరణ చేశారు. ఎంజీపురం పంచాయతీలోని ఇందిరాగిరిజన కాలనీ సమీపంలో క్వారీ ఏర్పాటుపై ప్రజల మనోగతాలను తెలుసుకునేందుకు గ్రామసభను నిర్వహించారు. క్వారీ ఏర్పాటు వల్ల ఎవరికై నా ఇబ్బందులు ఉంటే తెలియచేయాలన్నారు. కాలుష్య నివారణ శాఖ ఈఈ కిషోర్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం

మదనపల్లె: మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి వైఎస్‌ఆర్సీపీ నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని సమన్వయకర్త నిసార్‌ అహ్మద్‌ బుధవారం పరామర్శించారు. పాత కక్షలతో ప్రసాద్‌ (41) అనే వ్యక్తిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. గొడవ జరుగుతున్న సమయంలో అరుపులు, కేకలు విని వైఎస్‌ఆర్సిపి నాయకుడు, మేదర కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ తాలే సుబ్బు అక్కడికి చేరుకోగా అతనిపై కూడా దాడికి పాల్పడి కత్తితో గాయపరిచినట్టు బాధితుడు నిసార్‌ అహ్మద్‌ కు వివరించాడు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినట్టు తెలిపారు. తాలే సుబ్బును నిసార్‌ అహ్మద్‌ పరామర్శించి ధైర్యం చెప్పారు.

8న బ్యాడ్మింటన్‌,

టెన్నిస్‌ జట్ల ఎంపిక

మదనపల్లె సిటీ: జిల్లా స్థాయి శాప్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో భాగంగా (మాస్టర్స్‌) టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ క్రీడలకు సంబంధించి ఈనెల 8వతేదీన జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు. బ్యాడ్మింటన్‌ విభాగంలో 35 సంవత్సరాలు పైబడినవారికి (పురుషులు, మహిళలు) సింగిల్స్‌, డబుల్స్‌, 45 సంవత్సరాల పైబడిన పురుషులకు సింగిల్స్‌,డబుల్స్‌ పోటీలు మదనపల్లెలోని డిఎస్కే స్పోర్ట్స్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ, నారాయణ స్కూల్‌ పక్కన, ప్రశాంత్‌నగర్‌ ఉదయం 8 గంటల నుంచి జరుగుతాయన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి 14,15 తేదీల్లో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరుగుతాయని తెలిపారు. టెన్నిస్‌ విభాగంలో 40 సంవత్సరాలు పైబడిన వారికి (పురుషులు,మహిళలు)సింగల్స్‌, డబుల్స్‌ జట్లు మదనపల్లె పట్టణం ఇండియన్‌ యూనియన్‌ క్లబ్‌, టెన్నీస్‌ కోర్టులో ఎంపికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు మార్చి 22,23 తేదీల్లో విజయనగరంలో జరుగుతాయన్నారు. వివరాలకు రవీంద్రనాథ్‌ (86399 57054), మ స్తాన్‌ (7386901200)ను సంప్రదించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement