రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
గాలివీడు : రైతు వద్ద రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ వలలో చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ సత్యమూర్తి వ్యవహారంలో రెండవ రోజూ సోదాలు కొనసాగాయి. మంగళవారం గాలివీడు విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఏఈ సత్యమూర్తి, అతని కారు డ్రైవర్ శ్రీనివాసులును కార్యాలయంలో గంటకు పైగా రహస్యంగా విచారించారు. రైతుల నుంచి మరేదైనా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారా? ఇతర ఫిర్యాదులు ఉన్నాయా? అనే కోణంలో ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం. విచారణ అనంతరం నిందితులను తదుపరి చర్యల నిమిత్తం కడపకు తరలించినట్లు తెలుస్తోంది.
బర్రెల దొంగలను
పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
సిద్దవటం : కడప ఇందిరానగర్‌కు చెందిన జనార్దన్ మరో ఇద్దరు యువకులతో కలిసి బర్రెలను దొంగిలించి వాటిని తరలిస్తుండగా సిద్దవటం మండలంలోని కమ్మపాలెం గ్రామస్తులకు అనుమానం వచ్చి వారిని పట్టుకుని సిద్దవటం పోలీసులకు అప్పజెప్పారు. చింతకొమ్మదిన్నె మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన నాగార్జున అనే పాడి రైతుకు చెందిన 10 బర్రెలను జనార్దన్ మరో ఇద్దరు వ్యక్తులు దొంగిలించి వాటిని బద్వేల్ వైపు తీసుకెళుతుండగా మంగళవారం కమ్మపాలెం గ్రామస్తులు బర్రెల పొదుగు నుంచి పాలు కారిపోతుండటం గమనించి వాహనాన్ని ఆపారు. బర్రెల చెవులకు పాడి రైతు సెల్ నంబర్ ఉండటంతో ఫోన్ చేశారు. సీకేదిన్నె మండలం బలిజపల్లికి చెందిన నాగార్జున ఫోన్‌లో మాట్లాడుతూ తన బర్రెలు సోమవారం నుంచి కనిపించలేదని చెప్పాడు. దీంతో కమ్మపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి బద్వేలు వైపు తీసుకువెళ్తున్న బర్రెలను ఆపామని తెలిపారు. వెంటనే నాగార్జున సంఘటన స్థలానికి చేరుకొని కమ్మపాలెం గ్రామస్తులతో కలిసి వెళ్లి బర్రెల దొంగలను పోలీసులకు అప్పజెప్పారు. జరిగిన సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.


