కడప రాయుడి కోవెలలో కల్యాణ రాగం
కడప సెవెన్‌రోడ్స్: తిరుమలకు తొలిగడపగా భావించే కడప నగరంలోని దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు నిర్వహించి వధూవరులుగా అలంకరించి కల్యాణ వేదికపైగల ప్రత్యేక పీఠాలపై కొలువుదీర్చారు. అనంతరం ప్రధాన అర్చకులు మయూరం కృష్ణమోహన్ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సాయంత్రం కల్యాణమూర్తులను ప్రత్యేక పల్లకీపై కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. సాక్షాత్తు వైకుంఠ వాసుడే అమ్మవార్లతో కలిసి తమ ఇంటి ముంగిటికి రావడంతో భక్తులు పులకించి పూజాద్రవ్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. అర్చకులు మంగళ హారతులు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కడప రాయుడి కోవెలలో కల్యాణ రాగం


