జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు
రాయచోటి : అన్నమయ్య జిల్లా పరిధిలో ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా.. ఎ.వెంకటేశ్వర్లు మదనపల్లి వన్ టౌన్ అర్బన్, డి. రవీంద్రబాబు గుర్రంకొండ, పి.శ్రావణి పెద్దమండ్యం, జి.శోభ లక్కిరెడ్డిపల్లి, సి.ఉమా మహేశ్వర్ రెడ్డి డీసీఆర్‌బీ అన్నమయ్య, టి.అనిల్ కుమార్ తంబళ్లపల్లి, ముక్కెళ్ల ప్రతాప్ ములకల చెరువు, ఎంకె నరసింహుడు సీసీఎస్–1 అన్నమయ్య, బి.రామకృష్ణారెడ్డి మదనపల్లి తాలూకా అర్బన్ పీఎస్–1, జి. చంద్రమోహన్ మదనపల్లి తాలుకా అర్బన్ పీఎస్–2, సి.తిప్పేస్వామి వాల్మీకిపురం, సి. చంద్రశేఖర్ సైబర్ క్రైమ్ సెల్ అన్నమయ్య, సి.సుస్మిత వీరబల్లి, జె.నరసింహారెడ్డి గాలివీడు, పి. రామకృష్ణ రాజంపేట అర్బన్ పీఎస్–1, పి.వెంకటేశు, రాజంపేట అర్బన్ పీఎస్–2, వై.సుమన్ పీసీఆర్–1, అన్నమయ్యకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఎస్‌ఐలు వెంటనే వారికి కేటాయించిన స్థానాలలో రిపోర్టు చేసుకోవాలని ఎస్పీ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
ఒంటిమిట్టలో
ప్రధాన అర్చకుడిపై ఫిర్యాదు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని ఓ ప్రధాన అర్చకుడిపై మంగళవారం ఒంటిమిట్ట పరిపాలన భవనంలో ఉన్న ఆలయ ఇన్‌చార్జి డిప్యూటీ ఈఓ ప్రశాంతికి ఒంటిమిట్ట గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వారి వివరాల మేరకు ప్రధాన అర్చకుడి వైఖరి వల్ల ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందన్నారు. భక్తులు వేసే కానుకలను స్వామి వారి హుండీలో పడనివ్వకుండా, భక్తుల వద్ద హారతి పల్లెం పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఒంటిమిట్ట రామాలయానికి గతంలో కంటే నేడు భక్తల తాకిడి ఎక్కువ అయినా హుండీ ఆదాయం పెరగకపోవడానికి ఆ ప్రధాన అర్చకుడి పాత్ర ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఇన్‌చార్జి డిప్యూటీ ఈఓ విచారణ చేపడతామని చెప్పారు.
రాజంపేటలో ఎనీటైం మందు!
రాజంపేట : రాజంపేట బైపాస్‌లో ఉన్న బార్ల వద్ద సోమవారం తెల్లవారుజామున అమ్మకాలు గుట్టుచప్పుడుగా కొనసాగించారు. అటు సివిల్, ఇటు ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికారపార్టీకి చెందిన నేతల మద్దతుతో బార్లు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. బైపాస్‌లో కడప వైపు వింటేజ్ రెస్టారెంట్ అండ్ బార్, తిరుపతి వైపు జీకేఎస్‌ఆర్ కళ్యాణమండపం వద్ద తిరుమల బార్ రెస్టారెంట్ నిర్వాహకులు అసలు ప్రభు త్వం ఉందా లేదా అన్నట్లుగా దర్జాగా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రాజంపేట బైపాస్‌లో తెల్లార్లు మద్యం లభ్యం కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. బైపాస్‌లో ఇటీవల మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు అనేకం జరిగాయి. ఉదయం 10 గంటలకు తెరవాల్సిన బార్లు ఉదయం 6గంటలకే తెరిచి దర్జాగా మద్యం విక్రయిస్తున్నారు. అలాగే రాత్రి 11 గంటల వరకు కొనసాగించాల్సిన బార్‌లు అర్థరాత్రి వరకు మద్యం అమ్మకాలను సాగిస్తున్నారు. ఎనీటైం మద్యం కావాలంటే బైపాస్‌కు వెళ్లాల్సిందే అని మద్యం ప్రియులు అంటున్నారు.
కడప ఎడ్యుకేషన్ : కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ మంగళవారంతో ముగిసింది. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్, స్పోర్ట్స్ చాంపియన్, గేమ్స్ చాంపియన్‌తోపాటు వ్యక్తిగత చాంపియన్‌గా కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలిచారు. జిల్లావ్యాప్తంగా 15 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు రెండు రోజులపాటు అఽథ్లెటిక్స్ తదితర పోటీల్లో పాల్గొన్నారు. అన్ని ఈవెంట్లలో కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు స్థిరమైన ప్రదర్శనతో అగ్రస్థానాన్ని దక్కించుకుని చాంపియన్‌గా నిలిచారు. వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను కడప ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన భవ్యశ్రీ దక్కించుకుంది. అలాగే వాలీబాల్, ఖోఖో, లాంగ్‌జంప్, బ్యాడ్మింటన్, డిస్కస్‌త్రో, రన్నింగ్ పోటీలలో బాలికలు తమ ప్రతిభను చాటి విజేతలుగా నిలిచారు. విజేతలకు డీఆర్‌డీఏ– వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతిలు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఫిజికల్ డైరెక్టర్ పాల్గొన్నారు.
అక్రమాల వెలికితీతకే
సామాజిక తనిఖీ
కలకడ : జిల్లాలోని అన్ని గ్రామాలలో జరుగుతున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో అవినీతి, అక్రమాలు వెలికి తీయడానికే ప్రతి మండలంలో సామాజిక తనిఖీ చేపడుతున్నట్లు డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గత ఏడాది ఏప్రిల్–1వతేదీ నుంచి ఈ ఏడాది మార్చి–31వతేదీ జరిగిన పనులను సామాజిక తనిఖీ బృఽందం తనిఖీ చేసి నివేదికలను బహిరంగ సభలో చదివి వినిపించారు. అవినీతికి సంబంధించి రూ.19,179 రికవరీకి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భానుప్రసాద్, అంబుడ్స్‌మెన్ శ్రీరాములు, కలికిరి ఏపీడీ శ్రీనివాసులు, క్లస్టర్ ఏపీడీ మధుబాబు, ఎస్టీఎం కోనయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎస్‌ఐల బదిలీలు


