క్రీడలతో మానసిక ఉల్లాసం
● డీఐజీ కోయ ప్రవీణ్
● ముగిసిన జిల్లా పోలీసు
వార్షిక క్రీడా సంబరాలు
రాయచోటి : క్రీడలు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో మూడు రోజులుగా ఉత్సాహంగా సాగిన జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ – 2025 మంగళవారం సాయంత్రం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు కర్నూలు రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేతలకు బహుమతులను అందజేశారు. డీఐజీ మాట్లాడుతూ మైదానంలో ప్రదర్శించిన పట్టుదలను నేరాల నియంత్రణలోనూ చూపాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధుల్లో ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో అత్యధిక పాయింట్లు సాధించిన జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వ్ జట్టు ఛాంపియన్ ట్రోఫీని కై వసం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ‘టగ్ ఆఫ్ వార్ (తాడు లాగుట)’ పోటీ ఫైనల్లో రాయచోటి సబ్ డివిజన్ – ఏ ఆర్ జట్టు పోటీపడగా, ఏఆర్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, భారీ సంఖ్యలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబసభ్యలు పాల్గొన్నారు.


