పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలి
మదనపల్లె రూరల్ : జిల్లాలోని అన్ని పంచాయతీల్లో కార్యదర్శి నుంచి డీపీఓ వరకు ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా ఉండాలని డీపీఓ రాధమ్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని డీడీఓ కార్యాలయంలో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాలకు సంబంఽధించి డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులతో పారిశుధ్య నిర్వహణ, స్వామిత్వ సర్వేపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో ప్రతిరోజు శానిటైజేషన్ చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణను స్వయంగా పర్యవేక్షించాలన్నారు. గ్రీన్ అంబాసిడర్లు రెండురోజులకు ఒకసారి ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌యార్డులకు తరలించి, వర్మీ ప్రొడక్షన్ చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో 80 శాతానికి పైగా సంతృప్తికరంగా ఉన్నట్లు నమోదు కావాలన్నారు. స్వర్ణపంచాయతీ పోర్టల్‌లోని క్యూఆర్ కోడ్ ద్వారానే కార్యదర్శులు పన్ను వసూళ్లు చేయాలన్నారు. రసీదులు ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు చేపట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 501 గ్రామ పంచాయతీల్లో 286 గ్రామ పంచాయతీల్లో స్వామిత్వ సర్వే జరుగుతోందని, 162 పంచాయతీల్లో కొలతలు వేస్తున్నారని, 95 పంచాయతీల్లో గ్రామసభలు పూర్తయ్యాయన్నారు. డిసెంబర్ 27, జనవరి 2, 7 తేదీల్లోపు మూడు విడతలుగా అన్నిచోట్ల గ్రామసభలు నిర్వహించి 32 నోటిఫికేషన్ జారీ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీడీఓ అమరనాథరెడ్డి, డీఎల్‌పీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


