సివిల్ ఇంజినీరింగ్ పాత్ర కీలకం
కురబలకోట : వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో సివిల్ ఇంజినీరింగ్ పాత్ర కీలకమని చుట్టూ కన్పించే వివిధ నిర్మాణాల వెనుక ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పూణేలోని హిల్టి టెక్నాలజీస్ కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ పి. కార్తీక్ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అధునాతన సివిల్ ఇంజినీరింగ్ నిర్మాణ పద్ధతులపై మూడు రోజుల వర్క్‌షాపు సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక ఇవన్నీ సివిల్ ఇంజినీరింగ్ రంగానికి చెందిన వన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజినీరింగ్‌ను సమర్థవంతంగా మార్చాయన్నారు. దేశ అభివృద్ధికి సివిల్ ఇంజినీరింగ్ రంగం బలంగా ఉండాల్సిందేనన్నారు. భవిష్యత్ తరాలకు సుస్థిర ప్రపంచాన్ని అందించడంలో కీలకంగా నిలవనుందన్నారు.


