ఆగని ఆందోళనలు
రాజంపేట టౌన్ : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న ఆందోళనలు రోజు, రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిత్యం ఏదో ఒక ఆందోళనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆర్‌అండ్‌బి బంగ్లా నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు దారి వెంబడి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. కాగా ర్యాలీ ఫ్‌లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే కార్మికులంతా ఒక్కసారిగా రోడ్డుపై బైఠాయించి ఆర్‌ఎస్ రోడ్డును దిగ్బంధించి ధర్నాకు దిగారు. ఉన్నఫళంగా కార్మికులు మెరుపు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు కష్టపడాల్సి వచ్చింది. ధర్నాను విరమించాలని కోరినప్పటికి కొంతసేపు కార్మికులు ససేమిరా అని అలాగే బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి ఆర్‌ఎస్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. అనంతరం ఆందోళనకారులు సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని సబ్‌కలెక్టర్ భావనకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా గాలి చంద్రయ్య మాట్లాడుతూ రైల్వేకోడూరు, రాయచోటికి రాజంపేట మధ్యలో ఉందని అందువల్ల రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్నారు. అన్నమయ్య జన్మస్థలం రాజంపేట ప్రాంతమని, రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లా చేయడమే సముచితమని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు కె.వెంకటయ్య, పొట్టి సుబ్బరాయుడు, వేముల నరసింహ, మహమ్మద్ హుస్సేన్, నన్నేసాబ్, వెంకటస్వామి, పి.సుబ్రమణ్యం, నారాయణ పాల్గొన్నారు.
తీవ్రరూపం దాల్చిన రాజంపేట జిల్లా సాధన ఉద్యమం
భవన నిర్మాణ కార్మికుల ర్యాలీ
మెరుపు ధర్నా
ఆర్‌ఎస్‌రోడ్డు దిగ్బంధం


