జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
● వీబీజీ–రామ్ జీ ని రద్దు చేయాలి
● సబ్ కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల నిరసన
సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఎం కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు
సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న సీపీఐ నాయకులు తోపుకృష్ణప్ప తదితరులు
మదనపల్లె రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ, మోదీ సర్కారు నూతనంగా తీసుకువచ్చిన వీబీ–జీ–రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపుకృష్ణప్ప డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్షాలైన సీపీఎం, సీపీఐ పార్టీలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని కోరుతూ వేర్వేరుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా రెండు పార్టీల ముఖ్యనాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ స్వాతంత్రోద్యమ కాలపు నేతల పేర్లను నిస్సిగ్గుగా తొలగించేందుకు వెనుకాడటం లేదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కొత్త చట్టం వీబీ–జీ–రామ్–జీ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో బీజేపీ ప్రభుత్వం మహాత్ముడిపై విద్వేషం వెళ్లగక్కుతోందన్నారు. మతోన్మాదం ప్రతిబింబించేలా కొత్త చట్టాలకు పేర్లు పెడుతోందన్నారు. రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టానికి బీజేపీ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. నూతన చట్టం రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం మోపనుందన్నారు. ఈ కొత్త బిల్లు వలన ఉపాధి హామీ కూలీలకు ఒరిగేది ఏమీ ఉండదన్నారు. వేతనాల పెరుగుదల, పనిదినాల పెంపు సవ్యంగా లేకపోవడం, సగటువేతనం రూ.240కు తగ్గించడం జరిగిందన్నారు. యూపీఏ ప్రభుత్వంలో చట్టం తెచ్చినప్పుడు కేంద్రం 90శాతం నిధులు, రాష్ట్రాలు 10 శాతం నిధులు ఉపాధి హామీకి కేటాయించాలని నిర్ణయిస్తే, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రాష్ట్రాల మీద భారం పెంచే విధంగా అడుగులు వేస్తోందన్నారు. ఓ వైపు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోందన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న రాష్ట్రాల వాటాను ఎలా భరిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్‌డీఏలో భాగస్వామి కనుక, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కుట్రలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు హరిశర్మ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగరాజు, శేఖర్, నారాయణ, రమణ, సీపీఐ చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మురళీ, ఏఐఎస్‌ఎఫ్ మాధవ్, ఏఐటీయూసీ తిరుమల, చిన్నప్ప, వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి


