రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించుకుందాం
రైల్వేకోడూరు అర్బన్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉన్న రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాల్సిన బాధ్యత కుటమి ప్రభుత్వంపై ఉందని, కలిసికట్టుగా పోరాటాలు చేసైనా జిల్లా కేంద్రంగా రాజంపేటను సాధించుకుందామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. టోల్‌గేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు సోమవారం సంఘీభావం ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్ర సాధన కోసం జరుగుతున్న పోరాటాలకు వైఎస్సార్‌సీపీ మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. కూటమి నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరును మాత్రమే జిల్లాగా ఉంచడంతో ఇప్పుడు రాజంపేట జిల్లా ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అన్నమయ్య జిల్లాకు రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని డిమండ్ చేశారు. మంగళవారం జరిగే రైల్వేకోడూరు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పుల్లపేట ఎంపీపీ ముద్దా బాబుల్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, ఓబులవారిపల్లి, చిట్వేలి, పార్టీ అధ్యక్షులు వత్తలూరు సాయికిషోర్‌రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డిలు, జేఏసీ అధ్యక్షుడు ముత్యాల పెంచలయ్య, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


