ఆకేపాడు విభజనను అడ్డుకున్న గ్రామస్తులు
రాజంపేట రూరల్ : కొన్ని తరాల నుంచి 14 గ్రామాలు కలిసి ఒకే పంచాయతీగా కొనసాగుతున్న ఆకేపాడు పంచాయతీని 4 పంచాయతీలుగా విభజించాలని చూసిన కూటమి నాయకుల ప్రయత్నాలను సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి(మురళీరెడ్డి) ఆధ్వర్యంలో మూకుమ్మడిగా ప్రజలు అడ్డుకున్నారు. మండల పరిధిలోని ఆకేపాడు పంచాయతీ వడ్డుకాడపల్లిలో సోమవారం డీపీఓ రాధమ్మ ఆదేశాల మేరకు డీఎల్‌పీఓ మస్తాన్‌వలీ గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆకేపాడు పంచాయతీలోని 321 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలీ ఆకేపాడు పంచాయతీని 4 పంచాయతీలుగా విభజించటం ఇష్టం ఉన్న వారు వచ్చి సంతకం చేయాలన్నారు. ఏ ఒక్కరూ స్పందించలేదు. అదే విధంగా ఆకేపాడు పంచాయతీని ఒకే పంచాయతీగా ఉంచాలని కోరుకునే వారు వచ్చి సంతకం చేయాలని కోరడంతో మూకమ్ముడిగా తరలివచ్చి 321 మంది సంతకం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి సొంత పంచాయతీ ఆకేపాడు కావడం గమనార్హం. ఈ గ్రామసభలో ఈఓఆర్‌డీ అస్లఫ్‌వలీ, పంచాయతీ సెక్రటరీ కరిముల్లా, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.


