మదనపల్లెలో కార్డెన్ సెర్చ్
మదనపల్లె రూరల్ : పట్టణంలో సోమవారం వేకువజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో పట్టణంలోని దక్నీపేట, అగడ్తవీధి, గౌసియా వీధి, త్యాగరాజవీధి, బడేమకాన్ ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన రికార్డులు లేని 61 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణే లక్ష్యంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు. పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా యువత చెడుమార్గాల్లో వెళ్లకుండా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రికార్డులు కలిగి ఉండాలన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సీఐలు మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.
61 ద్విచక్రవాహనాలు స్వాధీనం


