ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తగదు
పీలేరురూరల్ : బోధనేతర పనులు ఉపాధ్యాయులకు చెప్పరాదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్వీఎస్‌ఎస్ కల్యాణమండపంలో యూటీఎఫ్ జిల్లా నాల్గవ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు భిన్నంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు చెప్పడం వల్ల చదువు పట్ల ఏకాగ్రత కోల్పోతున్నట్లు తెలిపారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కల్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, నాయకులు జావెద్, శివారెడ్డి, అక్రమ్‌బాషా, చంద్రశేఖర్, విశ్వనాథరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలు
లింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు.


