విద్యుత్‌షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి
నిమ్మనపల్లె : కొబ్బరి చెట్టు ఎక్కి టెంకాయలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌కు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ఆదివారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ యల్లారబైలుకు చెందిన జయరామిరెడ్డి కుమారుడు శ్రీనివాసులురెడ్డి(31) ఐదేళ్ల క్రితం నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ దిగువపల్లెకు చెందిన వెంకటరమణ, రమణమ్మ దంపతుల కుమార్తె చంద్రకళను ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆమె కోరిక మేరకు ఇల్లరికం వచ్చి దిగువపల్లెలో ఉంటూ కూలిపనులకు వెళుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నిమ్మనపల్లెకు వెళ్లి చికెన్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంతలోనే గ్రామంలో రోడ్డుపక్కన దుకాణం నిర్వహిస్తున్న యజమాని తమ కొబ్బరి చెట్టు నుంచి కాయలు కోయాల్సిందిగా కోరడంతో అక్కడకు వెళ్లి చెట్టు ఎక్కాడు. కాయలు కోసే క్రమంలో ఓ టెంకాయ మట్టను నరకగా, అది సగం మాత్రమే తెగి వంగిన భాగం 11 కే.వీ. విద్యుత్‌లైన్‌పై పడటంతో చెట్టుకు కరెంట్ సరఫరా కావడంతో శ్రీనివాసులురెడ్డి షాక్‌కు గురై అక్కడికక్కడే చెట్టుమీదనే మృతి చెందాడు. మృతుడికి కుమార్తె మేఘన(2), కుమారుడు మోక్షజ్ఞ (9నెలలు) ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికులు రోడ్డుపై బైఠాయించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ ఈఈ గంగాధరం, ఏడీఈ సురేంద్రనాయక్, ఏఈ నాగరాజు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతుడి భార్య చంద్రకళ నిమ్మనపల్లె పోలీసులకు ప్రమాద ఘటనపై ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు.


