తప్పుడు పత్రాలతో వక్ఫ్‌భూముల ఆక్రమణకు యత్నాలు
మదనపల్లె రూరల్ : పట్టణంలోని జామియా మసీదుకు చెందిన వక్ఫ్‌బోర్డు భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని జామియా, టిప్పుసుల్తాన్ మసీదు కమిటీ ప్రెసిడెంట్ హాజీ.గౌస్ మొహియుద్దీన్, సెక్రటరీ సికిందర్‌అలీఖాన్ ఆరోపించారు. ఆదివారం టిప్పుసుల్తాన్ మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. బీకే.పల్లె రెవెన్యూ గ్రామంలో 23.30 ఎకరాల వక్ఫ్‌భూమి ఉందన్నారు. ఈ భూమి ఇప్పటివరకు సబ్‌డివిజన్ కాలేదని, మండల తహసీల్దార్ ధృవీకరిస్తూ ఎండార్స్‌మెంట్ ఇచ్చారన్నారు. అయినప్పటికీ, మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చిన్నపాటి మార్పులతో సుమారు 90 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఈ విధంగా సృష్టించిన పత్రాలను ఆధారాలుగా చూపిస్తూ, కోర్టులో కేసులు వేసి ముస్లిం సమాజానికి చెందిన వక్ఫ్‌భూమిని కాజేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను అడ్డుకుని, వక్ఫ్‌భూముల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జామియా, టిప్పుసుల్తాన్ మసీదు అభివృద్ధి కమిటీ వైస్ ప్రెసిడెంట్ సర్దార్‌ఖాన్, జాయింట్ సెక్రటరీ అక్బర్‌బాషా, మెంబర్లు అబూబకర్ సిద్ధిక్, మహమ్మద్‌బాషా, సాజిద్‌అలీఖాన్, మహమ్మద్ జమీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


