బాల శాస్త్రవేత్తల వేదిక సైన్స్ ఫెయిర్
● పాఠశాల విద్య, ప్రాంతీయ సంయుక్త
సంచాలకులు శామ్యూల్
● ఘనంగా సైన్స్ ఫెయిర్
రాయచోటి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాల శాస్త్రవేత్తల అన్వేషణలను ప్రోత్సహించేందుకు జిల్లా సైన్స్ ఫెయిర్ ఒక అద్భుత వేదిక అని పాఠశాల విద్య సంయుక్త సంచాలకులు శామ్యూల్ అన్నారు. రాయచోటి పట్టణం, డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో దాగి ఉన్న అన్వేషణాత్మక ఆలోచనలకు సైన్స్ ఫెయిర్లు పదును పెడుతున్నాయన్నారు. పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలు వెతకడానికి ఇవి దోహదపడతాయన్నారు. విద్యార్థి దశ నుండే బాలలు అన్వేషణాత్మక ప్రాజెక్టులను రూపొందించడం చాలా గొప్ప విషయమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో జిల్లాను రాష్ట్రంలో ముందు వరుసలో నిలుపుతున్న అన్నమయ్య జిల్లా సైన్స్ ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల నుంచి 330 ప్రాజెక్టులు జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రదర్శించారన్నారు. వీటిలో రెండు టీచరు విభాగంలో, మరో రెండు వ్యక్తిగత విభాగం నుంచి, ఏడు గ్రూపు విభాగం నుంచి మొత్తం 11 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. జిల్లా విజేతలు ఈనెల 23, 24వ తేదీలలో విజయవాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో పాల్గొనాలన్నారు. ఈ సైన్స్ ఫెయిర్ మిగిలిన విద్యార్థులలో చక్కటి స్ఫూర్తిని నింపిందన్నారు.
సైన్స్ ఫెయిర్‌ను సందర్శించిన అధికారులు..
సైన్స్ ఫెయిర్‌ను ఆర్‌జేడీ, డీఈఓ, ఏపీసీ అధికారులు విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. ప్రతి స్టాల్‌ను సందర్శిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ప్రాజెక్టుల వెనుక ఉన్న శాసీ్త్రయ సూత్రాలను స్పష్టంగా వివరించడం గమనార్హం. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రాజెక్టులు ప్రాయోగికత, సామాజిక అవసరాలపై దృష్టి పెట్టడం ప్రశంసనీయమని అధికారులు తెలిపారు. విజేతలకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కొండూరు శ్రీనివాసరాజు, ఏఎంఓ అసదుల్లా, సెక్టోరియల్ అధికారులు జనార్దన్, డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శివ భాస్కర్, సంఘం నాయకులు రామచంద్ర, వీరాంజనేయులు, శివారెడ్డి, నరసింహులు, జ్యూరీ సభ్యులు, గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉరకలెత్తిన ఉత్సాహం
డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన –2025 ఎంతో ఉత్సాహంగా సాగింది. తమ ప్రాజెక్టులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యార్థులు ప్రదర్శించారు. ప్రదర్శనలను తిలకించడానికి వచ్చిన వారిని అబ్బురపరిచాయి. జిల్లా నలుమూలల నుంచి 330 పాఠశాలల నుంచి ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. అలాగే ఉపాధ్యాయులు కూడా ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు.
విజేతలు..
టీచర్స్ విభాగంలో..
బి.ప్రకాష్ రెడ్డి (రాయచోటి మండలం, జడ్పీహెచ్‌ఎస్ కె.రామాపురం), సువర్ణాదేవి(వాల్మీకిపురం మండలం, జడ్పీహెచ్‌ఎస్ గర్‌ల్స్ హైస్కూల్)
వ్యక్తిగత విభాగంలో..
జి.రుకియా (చిట్వేలి మండలం జడ్పీహెచ్‌ఎస్ చిట్వేలి), సిద్దార్థ రెడ్డి (బి కొత్తకోట మండలం, జడ్పీహెచ్‌ఎస్ గట్టు)
గ్రూపు విభాగంలో...
సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో జి.నవ్య, ఎన్.అక్షిత (కలకడ మండలం ఏపీఆర్‌ఎస్ గర్‌ల్స్ కలకడ), వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్ విభాగంలో టి.లాస్య రెడ్డి, జి విజయలక్ష్మీ(ఓబులవారిపల్లి మండలం, జడ్పీహెచ్‌ఎస్ మంగంపేట), గ్రీన్ ఎనర్జీ విభాగంలో దివ్యశ్రీ, ఎ సుస్మిత (చిట్వేలి జడ్పీహెచ్‌ఎస్), ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో బి.ప్రకాష్, జి,మహీధర్ నాయుడు (ఏపీఎంఎస్ రామాపురం), రిక్రియేషన్‌లో మ్యాథమెటికల్ మోడలింగ్ విభాగంలో వి.హర్షప్రియ, ఈ.వినయ్( సుండుపల్లి మండలం, జడ్పీహెచ్‌ఎస్ తిమ్మ సముద్రం) , హెల్త్ అండ్ హైజిన్ విభాగంలో కె.హర్షవర్దన్, సి.మహేష్ (వీరబల్లి మండలం, జడ్పీహెచ్‌ఎస్ ఆర్విపల్లి), వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో కె.చందు, పి.భరత్ కుమార్ (జడ్పీహెచ్‌ఎస్ చిట్వేలి)
బాల శాస్త్రవేత్తల వేదిక సైన్స్ ఫెయిర్


