విద్యుత్ షాక్‌తో రైతు మృతి
మదనపల్లె రూరల్ : పంటకోతకు పొలానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే రైతు ప్రాణాలు విడిచిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. దుబ్బిగానిపల్లె పంచాయతీ ఎనుములవారిపల్లెకు చెందిన తాతప్ప కుమారుడు చంద్రశేఖర్(58) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి భార్య రత్నమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాది రబీలో తనకున్న పొలంలో వరిపంట సాగు చేశాడు. 15 రోజులుగా పంట కోత కోసం తడి ఆరబెట్టిన కారణంగా పొలం వద్దకు వెళ్లలేదు. పొలంపై వెళుతున్న 11 కేవీ విద్యుత్ వైరు తెగి కిందపడింది. ఈ విషయం తెలియని రైతు చంద్రశేఖర్ శనివారం పంట కోతలో భాగంగా వరి కోత యంత్రాన్ని పొలం వద్దకు పిలిపించాడు. పంటకోత కోసేందుకు డ్రైవర్‌కు దారి చూపుతూ ముందువైపు నడుస్తూ విద్యుత్ తీగ తెగిపడిన పొలంలోకి వెళ్లాడు. వెళ్లే క్రమంలో విద్యుత్ తీగను గమనించకపోవడంతో ప్రమాదవశాత్తు కాలికి తగిలి షాక్‌కు గురయ్యాడు. షాక్ తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడికక్కడే పొలంలోనే ప్రాణాలు విడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ మదనపల్లె డివిజన్ ఈఈ గంగాధరం ఆదేశాలతో ఏడీఈ హరిబాబు, ఏఈ రమేష్‌లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. విద్యుత్ తీగలు తెగి పడిన విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


