అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బాధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్‌ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్‌లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మహేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు.


