ఉపాధి హామీ సవరణలకు వ్యతిరేకంగా నిరసన
మదనపల్లె రూరల్ : గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్ని, పార్లమెంటులో చట్ట సవరణ చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సవరణలకు వ్యతిరేకంగా శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం, వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ... ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలను రద్దు చేయాలన్నారు. చట్టబద్ధహక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉపాధిహామీ పథకం పేరును మార్చడం మహాత్ముడిని అవమానించడమేనన్నారు. ఉపాధిహామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్తబిల్లుతో నామమాత్రంగా మారుతుందన్నారు. 10 నుంచి 40 శాతం రాష్ట్రాలపై భారం పెంచారన్నారు. ఇప్పటివరకు పథకం అమలుకు కేంద్రప్రభుత్వం ఇస్తున్న 90శాతం నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేలకోట్లు అదనపు భారం వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ, ఆటో యూనియన్ నాయకులు శ్రీరాములు, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మికసంఘం నాయకులు మోహన్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పామూరి సుబ్రమణ్యంపై కేసు నమోదు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.


