చీటీల పేరుతో రూ.కోటి దాకా కుచ్చు టోపి..?
● ఒకొక్కరికి రూ.3 నుంచి
రూ.10 లక్షల దాకా ఎగ్గొట్టిన వైనం
● లబోదిబోమంటున్న బాధితులు
పెద్దతిప్పసముద్రం : కూలీ నాలీ చేసి కొంత మంది, వ్యవసాయం, వ్యాపారాలు చేసుకుని మరి కొందరు ఇలా పైసా పైసా కూడబెట్టుకున్నారు. ఇలా కూడబెట్టిన సొమ్మును ఓ ప్రైవేటు వ్యక్తి వద్ద పొదుపు చేసి నెలల వారీ చీటీలు వేశారు. ఇంట్లో జరిగే శుభ కార్యాలు, లేదా గృహ అవసరాలకు ఆసరాగా ఉంటుందని భావించారు. తీరా చీటీలు వేసిన నిర్వాహకుడు అమాయక ప్రజలను నిలువునా ముంచేసి పరారయ్యాడు. రూ.కోటి దాకా ప్రజల సొమ్ముతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రంగసముద్రం పంచాయతీ విసనకర్రవాండ్లపల్లికి చెందిన పుంగనూరు రామాంజనేయరెడ్డి అనే వ్యక్తి పీటీఎం, బి.కొత్తకోట మండలాలతో పాటు కర్నాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడిగా, నమ్మకస్థుడిగా పేరు గాంచాడు. ఇతను రూ.2 నుంచి రూ.10 లక్షల వరకు నెలవారీ చీటీలు నడుపుతూ ముగిసిన చీటీదారులకు సకాలంలో డబ్బులు తిరిగి చెల్లిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యాడు. దీంతో పదుల సంఖ్యలో చాలా మంది కాయ కష్టం చేసి కూడబెట్టుకున్న డబ్బును ఇతని వద్ద నెలకు రూ.6 నుంచి రూ.10 వేల దాకా చీటీల్లో పొదుపు చేసేవారు. ఈ తరుణంలో చీటీల గడువు ముగిసినా బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించడంలో నిర్వాహకుడు కాలయాపన చేసాడు. ఇలా గత 10 నెలల పాటు ఇదిగో అదిగో ఇస్తామని ప్రజలకు నమ్మబలికేవాడు. ఈ తరుణంలో చీటీల నిర్వాహకుడు గత మూడు నెలల నుంచి బాధితులకు తప్పించుకుని తిరగడంతో విసిగి వేసారిన ప్రజలు న్యాయం చేయాలని పోలీసులను ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ పరమేశ్ నాయక్‌ను వివరణ కోరగా పరారీలో ఉన్న చీటీల నిర్వాహకుడు ఇప్పటికే కోర్టును ఆశ్రయించి పలువురికి నోటీసులు కూడా పంపాడని సదరు బాధితులు కూడా న్యాయస్థానంను ఆశ్రయిస్తే బాగుంటుందని హితబోధ చేశారు.


