సాధుకొండలో మైనింగ్ సర్వే?
– అడ్డుకున్న గ్రామస్తులు
తంబళ్లపల్లె : తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ, ఇనుముకొండ, సాధుకొండ సముదాయంలోని అటవీ ప్రాంతంలో మళ్లీ మైనింగ్ సర్వే కలకలం రేపింది. రెండు రోజులుగా కర్ణాటకకు చెందిన ఓ మైనింగ్ కంపెనీకి చెందిన నలుగురు జియాలజిస్టులు సాధుకొండ అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పరిసరాల గ్రామ ప్రజలు గుర్తించారు. అనుమానంతో వారిని నిలదీసి ప్రశ్నించారు. త్వరలో మైనింగ్ టెండర్లు ఉన్నందు వల్ల ఒకసారి ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఓ రామ్‌రాజ్‌కు తెలిపారు. హుటాహుటిన ఎఫ్‌బీఓ అక్కడికి వచ్చి అటవీశాఖ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే అడవిలోకి వెళ్లడానికి వీలులేదని వారిని వెనక్కుపంపివేశారు. ఈ విషయంపై మళ్లీ మైనింగా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
వంక కాలువ పూడ్చివేత
మదనపల్లె రూరల్ : మండలంలోని బసినికొండ పంచాయతీలో చిత్తూరు–మదనపల్లె ప్రధాన జాతీయరహదారిపై మాదినికొండ అటవీప్రాంతం నుంచి దిగువకు నీరు వెళ్లే వంక కాలువను పూడ్చివేసేందుకు కొందరు ప్రయత్నించారు. ఈ విషయమై శుక్రవారం స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో వీఆర్వో మహేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వంక కాలువకు ఆనుకుని భూమిని చదును చేస్తున్న యజమానులతో మాట్లాడారు. వారు తమ పట్టాభూమిలో స్థలం చదునుచేస్తున్నామని చెప్పడంతో, సొంత భూమి అయినప్పటికీ వంకను పూడ్చివేసే అధికారం లేదని చెప్పారు. దీంతో యజమాని రెవెన్యూ అధికారులతో దురుసుగా మాట్లాడటంతో తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బైండోవర్ నోటీసును అందజేశారు.


