బ్రాందీషాపులో చోరీ
రాజంపేట : మండలంలోని న్యూ బోయనపల్లెలో మేఘన బ్రాందీషాపులో చోరీ జరిగినట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. బ్రాందీషాపు పైకప్పు రేకులు గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. షాపులోని మద్యం, రూ.1లక్షా 55వేలు నగదును ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన బ్రాందీషాపును పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బంగారు దుకాణంలో చోరీ
పట్టణంలో ఓ బంగారు దుకాణంలో కొనుగోలుదారులా వచ్చిన ఓ మహిళ బంగారు చైన్‌ను దొంగిలించుకుని వెళ్లింది. ఈ విషయాన్ని సీసీ కెమెరా ద్వారా గుర్తించారు. ఆ మహిళపై పట్టణ పోలీసులకు బంగారు దుకాణం యజమాని ఫిర్యాదు చేశారు.
వీబీ –జీఆర్‌ఎమ్ జీ బిల్లు ప్రతులు దగ్ధం
మదనపల్లె : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా వీబీ–జీ ఆర్‌ఎమ్ జీ బిల్లు ప్రతులను వ్యవసాయ కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం దగ్ధం చేశారు. మదనపల్లె పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (విబి–జి ఆర్‌ఎమ్ జి) పేరుతో ఉపాధిహామీ పథకానికి రాంరాం పలుకుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండ్‌ను బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి అవసరాన్ని (సప్లయిని) బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమేనని విమర్శించారు. గ్రామీణ కూలీలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఈ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించారని తెలిపారు. మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతుదారులైన టీడీపీ, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ, నారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు బి.రమేష్ బాబు, మంజునాథ, రమణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రెండు మండలాలను
కడపలో చేర్చాలి
సిద్దవటం : ఉద్యమం తీవ్రతరం కాకముందే సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలోనే ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి అన్నారు. సిద్దవటంలో మండల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం రాయలసీమ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తస్లీమ్, కార్యదర్శి లక్ష్మీదేవి, రాయలసీమ రైతు సంఘం రాష్ట్ర నాయకులు ప్రతాప్‌రెడ్డి, మునిరెడ్డి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జేఏసీ నాయకులు రాజగోపాలయ్య, నారాయణ, అనిల్‌కుమార్‌రెడ్డి, సిద్దయ్య, సుబ్రమణ్యం, ఓబులయ్య, రాజేష్, బాలుగారి వెంకటసుబ్బయ్య, నరసింహారెడ్డి, పి.వెంకటసుబ్బయ్య, భాస్కర్‌రెడ్డి, చంద్రమోహన్, మునికుమార్, అంకయ్య, ఆటో యూనియన్ సభ్యులు, మహిళలు, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.


