దివ్యాంగుల సాధికారతకు ప్రత్యేక చర్యలు
రాయచోటి : సామాన్య జనంలో దివ్యాంగులు కూడా ఒక భాగంగా ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధి, పునరావాస సేవలతో పాటు.. సాధికారత కోసం పాటుపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. ‘సామాజిక్ అధికారిత శివిర్’ కార్యక్రమంలో భాగంగా గురువారం రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో కేంద్ర సామాజిక న్యా యం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఏఎల్‌ఐఎంసీఓ సంస్థ, జిల్లా పరిపాలన, ఎంఎస్‌జేఈలు సంయుక్తంగా సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవయవ లోపాలున్న దివ్యాంగులకు కృత్రిమ అవయవ పరికరాలు, సహాయక ఉపకరణాలను అందించే బృహత్తర కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ కిశోర్ మాట్లాడుతూ జిల్లాలోని రాయచోటి, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలలో 2025 ఆగస్టు 6 నుంచి 8 వరకు ఏడీఐపీ, ఆర్‌వీవై పథకాల కింద అంచనా శిబిరాలు నిర్వహించి 832 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల ఛైర్మన్ గడుపూడి నారాయణస్వామి, సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు, బ్యాంకింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు.
జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్


