యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
సిద్దవటం : మండలంలోని మాచుపల్లి, డేగనవాండ్లపల్లె గ్రామ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల నుంచి నిత్యం కడపకు ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు గురువారం మాట్లాడుతూ ప్రతి రోజూ 50 ట్రాక్టర్లు మాచుపల్లి, డేగనవాండ్లపల్లె గ్రామాల పెన్నా పరివాహక ప్రాంతాలలో తమ పొలాల వద్ద గోతులు తీసి కడపకు ఇసుకను రవాణా చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ట్రాక్టర్ రూ.7 వేలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీని ప్రభావం వల్ల పెన్నానదికి వరదలు వచ్చినప్పుడు తమ భూములు కోతకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఒంటిమిట్ట సీఐ నరసింహరాజును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. గృహ నిర్మాణాలకు మాత్రమే ఆయా గ్రామాల వాసులు వినియోగించుకోవాలని కడపకు తరలించరాదని తెలిపారు.


