వాట్సప్ ద్వారా ఎఫ్‌ఐఆర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
రాయచోటి : పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ పారదర్శకమైన పాలన అందించే దిశగా అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం మరో ముందడుగు వేసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రవేశపెట్టిన మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇకపై ఫిర్యాదుదారులు తమ ఎఫ్‌ఐఆర్ (ప్రథమ సమాచార నివేదిక) ప్రతిని నేరుగా తమ మొబైల్ ఫోన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎస్పీ వెల్లడించారు. రాయచోటిలోని జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఎఫ్‌ఐఆర్ విషయంపై మీడియా సమావేశంలో వివరించారు. ప్రజలు సమయాన్ని ఆదా చేయడం, పోలీసు సేవల్లో జవాబుదారితనాన్ని పెంచడమే తమ లక్ష్యమన్నారు.
ఎఫ్‌ఐఆర్ ప్రతిని ఇలా....
మీ మొబైల్‌లో 9552300009 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సర్ ద్వారా సదరు నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాలి. మెనూలో కనిపించే పోలీసు సర్వీస్ పైన క్లిక్ చేసి, ఆపై డౌన్‌లోడ్ ఎఫ్‌ఐఆర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అడిగిన ప్రాథమిక వివరాలను నమోదు చేసిన వెంటనే మీ ఎఫ్‌ఐఆర్ ప్రతి డౌన్‌లోడ్ అవుతుంది.


