మోరాళ్ల గుట్టలో మైన్స్ ఏర్పాటు చేయొద్దు
● గ్రామ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది
● ఏకగ్రీవంగా వ్యతిరేకించిన గ్రామస్తులు
గాలివీడు : మండలంలోని నూలివీడు పంచాయతీ పరిధిలోని మోరాళ్ల గుట్టలో మైనింగ్ ఏర్పాటు చేయవద్దని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. మోరాళ్ల గుట్టలో మైనింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం ఆర్డీఓ, పొల్యూషన్ బోర్డ్ అధికారులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ, నూలివీడు పంచాయతీ పరిధిలోని మోరాళ్ల గుట్టలో 23 ఎకరాల్లో మైనింగ్ ఏర్పాటు చేసేందుకు మెసేజ్ గ్లోబల్ మైన్స్ అండ్ మినరల్స్ సంస్థ దరఖాస్తు చేసుకుందన్నారు. దీనిపై ఇప్పటికే ప్రాథమిక పరిశీలన జరిగిందని తెలిపారు. మైన్స్ ఏర్పాటు వల్ల గ్రామస్తులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలు కోరారు.
అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో దాదాపు 500 వరకు ఆవులు, గేదెలు, గొర్రెలు ఉన్నాయని, వాటిని మేపుకోవడానికి మోరాళ్ల గుట్ట ఒక్కటే ఆధారమని తెలిపారు. ఆ గుట్టను కూడా మైనింగ్‌కు కేటాయిస్తే మూగజీవాలను ఎక్కడ మేపుకోవాలని ప్రశ్నించారు. గ్రామ పరిధిలో ఇది తప్ప మరో ఖాళీ ప్రభుత్వ స్థలం లేదని వారు స్పష్టం చేశారు. అదే విధంగా మైన్స్ ఏర్పాటు చేస్తే బ్లాస్టింగ్ జరిగి శబ్ద కాలుష్యం పెరిగి సమీప గ్రామాల్లో ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని కొంతమంది గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాక గుట్టకు సమీపంలో మామిడి తోటలు, పంట భూములు ఉన్నాయని, మైనింగ్ వల్ల వెలువడే దుమ్ము, వ్యర్థాల కారణంగా వ్యవసాయం పూర్తిగా నాశనం అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఏకగ్రీవంగా మైన్స్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను అధికారులకు తెలియజేశారు. అయితే బయట నుంచి వచ్చిన కొంతమంది ఎన్‌జీఓలు మాత్రం మైన్స్ ఏర్పాటు చేయాలని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ, ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అన్ని అభిప్రాయాలను వీడియో రూపంలో రికార్డు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సుధ, స్థానిక తహసీల్దార్ భాగ్యలత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


