పింఛన్ డబ్బుల్లో ఇంటి పన్ను కోత
● 15 రోజులు కావస్తున్నా ఇంకా
ఆన్‌లైన్ రశీదు కూడా ఇవ్వని వైనం
● ఇదేం అన్యాయమని
పింఛన్‌దారుల ఆవేదన
పెద్దతిప్పసముద్రం : రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ప్రతి నెలా మొదటి వారంలో అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్ సొమ్ము అందజేస్తారు. పింఛన్‌దారుల్లో చాలా మంది అభాగ్యులు ఈ సొమ్ము పైనే ఆధారపడి జీవిస్తుంటారు. వీరిలో మంచానికి పరిమితమైన వారు ఉంటారు. అయితే పింఛన్‌దారుల సొమ్ములో ఇంటి పన్ను, నీటి పన్నును తీసుకుని మిగిలిన సొమ్మును లబ్ధిదారుల చేతికి ఇవ్వడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పింఛన్‌దారుల కథనం మేరకు.. మండలంలోని కాట్నగల్లు పంచాయతీ మద్దిరెడ్డిపల్లిలో ఈ నెల 1, 2 తేదీల్లో నెలవారి పింఛన్ సొమ్మును బట్వాడా చేశారు. అయితే పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ ఒక జాబితా చేతబట్టి మీరంతా ఇంటి పన్నులు కచ్చితంగా చెల్లించాల్సిందేనని చెప్పి పన్ను డబ్బులు తీసుకుని మిగిలిన పింఛన్ సొమ్మును పంపిణీ చేశారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.1,000లు మొదలుకుని రూ.1,800ల వరకు సుమారు రూ.40 వేల దాకా ఇంటి పన్ను రూపంలో వసూలు చేసి పింఛన్‌దారులకు మ్యానువల్ రశీదు ఇచ్చారు. సాధారణంగా ఇంటి పన్ను చెల్లించిన వారికి అధికారులు ఆన్‌లైన్ రశీదు ఇవ్వాలి. 15 రోజులు కావస్తున్నా మాకు ఎవరూ ఆన్‌లైన్ రశీదు ఇవ్వలేదని పింఛన్‌దారులు వాపోయారు. ఆఖరికి తమ పేరిట ప్రభుత్వానికి ఇంటి పన్ను జమ అయినట్లు ఫోన్లకు ఎలాంటి సమాచారం కూడా రాలేదన్నారు. ఈ సందర్భంగా పింఛన్‌దారులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ ఎవరూ ఇలా పింఛన్ డబ్బుల్లో కోత వేయలేదన్నారు. ఏడాదికోసారి ఇళ్ల వద్దకు వచ్చి పంచాయతీకి పన్నులు వసూలు చేసేవారని, పంచాయతీలో ఇన్ని ఊర్లు ఉండగా మా ఊర్లోనే ఇలా వసూలు చేయడం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంచానికే పరిమితమైన భువనేష్‌కుమార్ అనే దివ్యాంగుడి డబ్బుల్లో కూడా రూ.1000లు ఇంటి పన్ను వసూలు చేయడం బాధాకరమని పలువురు పింఛన్‌దారులు క్రిష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, రామిరెడ్డి, మద్దమ్మ, ఈశ్వరమ్మ, రఘునాథ్‌రెడ్డి, రజనమ్మ, బయారెడ్డిలు వాపోయారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పన్ను వసూలు చేసి ఆన్‌లైన్‌లో డబ్బు జమ చేశామని తెలిపారు.


