మోసం చేశారని ఇంటి ముందు హిజ్రా బైఠాయింపు
మదనపల్లె : నమ్మించి డబ్బు, బంగారం తీసుకుని మోసం చేసిన దంపతులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని బుధవారం సాయంత్రం మదనపల్లెకు చెందిన హిజ్రా స్వాతి వారి ఇంటిముందు బైఠాయించింది. చేతులెత్తి దండం పెడుతూ కన్నీళ్లతో తనగోడు చెప్పుకొంటూ వేడుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు. మదనపల్లెకు చెందిన హిజ్రా ఇంజరపు స్వాతి, గౌతమినగర్‌కు చెందిన దంపతులు డమరేశ్వర్ స్వర్ణలత మధ్య స్నేహం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారం, చిట్టీల పేరుతో స్వాతి నుంచి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు తీసుకున్నారు. తర్వాత నగదు, ఆభరణాలు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా పట్టించుకోలేదు.గట్టిగా నిలదీస్తే ఎదురుతిరిగారు. దంపతులు తనవద్ద నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నట్లు రసీదులు, ఆధారాలు ఉన్నాయని ఆమె వివరించింది. గత ఐదు నెలలుగా గుర్తు తెలియని వ్యక్తులు తనను వెంబడిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ఇప్పటికై నా న్యాయం చేయాలని కోరింది.
నకిలీ నోట్లతో మోసగించే యత్నం
లక్కిరెడ్డిపల్లి : బ్యాంకులో నగదు డ్రా చేసిన వ్యక్తికి నకిలీ నోట్లు ఇచ్చి అసలు నోట్లతో ఉడాయించేందుకు కొందరు మోసగాళ్లు ప్రయత్నించారు. మోసాన్ని పసిగట్టి స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా.. లక్కిరెడ్డిపల్లి మండలం, కుర్నూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి కొంత నగదును విత్ డ్రా చేసుకునేందుకు బుధవారం లక్కిరెడ్డిపల్లి స్టేట్ బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ రూ.50 వేలు విత్‌డ్రా చేసుకుని అక్కడే ఉన్న ఓ వ్యక్తి చేతికి ఇచ్చి లెక్కబెట్టమని చెప్పాడు. అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు అసలు నోట్లు వారివద్ద ఉంచుకుని తమ వద్ద ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న దొంగనోట్ల కట్టను బయటకు తీసి లెక్కించడం మొదలు పెట్టారు. ఇంతలో వారిలో నుంచి ఒకరు ఇవి దొంగనోట్లలా ఉన్నాయని ఆదినారాయణతో అన్నారు. తానిప్పుడే బ్యాంకులో డ్రా చేశానని మీరెవరంటూ వారితో గట్టిగా మాట్లాడేసరికి వారు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. స్థానికులు అప్రమత్తమై వారిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతను తనది వాయల్పాడు అని చెప్పాడు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ మస్తాన్, మరో ఇద్దరు పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని మోసగాడిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.


