పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు కేటాయించాలి
గాలివీడు : హంద్రీ–నీవా, జీఎస్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టుల ద్వారా వెలిగల్లు జలాశయానికి నీరు అందించే పథకం పనులు అమలుకు నిధులు కేటాయించాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి. నారాయణ కోరారు. బుధవారం చక్రాయపేట మండలం లోని కాలేటి వాగు, ఎన్‌పీ కుంట హంద్రీ–నీవా కాలువ, గాలివీడు మండలం వెలిగల్లు జలాశయం, శ్రీనివాసపురం ఎత్తి పోతల పథకం కాలువలను వేదిక సభ్యులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయలసీమలోని కరువు ప్రాంతాలకు శ్రీశైలం వరద నీటిని తరలించి సాగునీరు, తాగునీరు అందించే భారీ ప్రాజెక్టు అన్నారు. దీని ద్వారా వెలిగల్లు ప్రాజెక్టు సహా అనేక రిజర్వాయర్లు నిండుతాయన్నారు. కృష్ణా జలాలను రాయలసీమ లోతట్టు ప్రాంతాలకు చేర్చే ముఖ్యమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరం పనులు చేపట్టి రాయలసీమ రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్యాంప్రసాద్, ఏఐసీసీ మెంబర్ ఎస్‌ఏ సత్తార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీ శివయ్య, సభ్యులు పాపిరెడ్డి, డీసీ వెంకటయ్య, జిల్లా నాయకులు వెంగళరావు యాదవ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


